తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Satellite-based Toll Collection: టోల్ ప్లాజాలు ఇక గతం; త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు: నితిన్ గడ్కరీ

Satellite-based toll collection: టోల్ ప్లాజాలు ఇక గతం; త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు: నితిన్ గడ్కరీ

HT Telugu Desk HT Telugu

28 March 2024, 17:28 IST

google News
    • Satellite-based toll collection: ప్రస్తుతం కొనసాగుతున్న టోల్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు. ఆ విధానం వల్ల టోల్ వసూలు వేగవంతం అవుతుందని, టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలు ఉండబోవని తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ రహదారులపై ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ ప్లాజా (Toll plaza) లు త్వరలో చరిత్ర లో కలిసిపోనున్నాయి. భారతదేశం కొత్త టోల్ వసూలు వ్యవస్థకు మారడానికి సిద్ధమవుతోంది. త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్లను (Satellite-based toll collection) ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. వాహనాల నుంచి రుసుమును మినహాయించడానికి ఎంపిక చేసిన కేంద్రాల వద్ద జీపీఎస్, కెమెరాలను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కొత్త టోల్ వసూలు విధానం త్వరలో ప్రారంభమవుతుందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దీనిని కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి..

కొత్త టోల్ వసూలు విధానంలో.. వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా రుసుమును మినహాయిస్తుంది. టోల్ (Toll) మొత్తం వాహనం ప్రయాణించిన దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారమంతా జీపీఎస్ ద్వారా సేకరిస్తారు. ప్రస్తుతం వాహనం ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి ప్లాజా వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత..

కొత్త శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని ఈ మార్చి నెలాఖరులోగా అమలు చేస్తామని గడ్కరీ గత ఏడాది డిసెంబర్ లో ప్రకటించారు. అయితే లోక్ సభ ఎన్నికల (Lok sabha elections) ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటం వల్ల ఈ విధానాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదని గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ ట్యాక్స్ విధానం సమయం, ఇంధనాన్ని ఆదా చేయడానికి ఎలా సహాయపడుతుందో గడ్కరీ వివరించారు. ‘‘గతంలో ముంబై నుంచి పుణెకు వెళ్లాలంటే 9 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 2 గంటల ప్రయాణం. అంటే, ఏడు గంటల ప్రయాణానికి అవసరమయ్యే ఇంధనం ఆదా అవుతుంది. అందుకు ప్రతిఫలంగా సహజంగానే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ- ప్రైవేటు పెట్టుబడుల రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఆ డబ్బును కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే రెండు చోట్ల టెస్ట్ రన్ నిర్వహించాం’’ అని గడ్కరీ తెలిపారు.

ఫాస్టాగ్ లను ఇక మర్చిపోవచ్చు

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు ప్రస్తుతం ఫాస్టాగ్ అనే ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నాయి. 2021 ఫిబ్రవరి 15 నుంచి టోల్ వసూలుకు ఫాస్టాగ్ (FASTag) లను తప్పనిసరి చేశారు. ఆర్ఎఫ్ఐడీ ఆధారిత బారియర్ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. బారియర్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు వాహనాల ఫాస్టాగ్ ఐడీలు స్కాన్ చేస్తాయి. అనంతరం, నిర్ణీత మొత్తంలో టోల్ రుసుము వసూలు అవుతుంది.

తదుపరి వ్యాసం