Rolls Royce Cullinan Series II : ఇది భారతదేశంలోనే అత్యంత లగ్జరీ ఎస్యూవీ- ధర ఎంతో గెస్ చేయండి..!
29 September 2024, 7:20 IST
- రోల్స్ రాయిస్‌కు చెందిన కల్లినన్ సిరీస్ 2 వివిధ అప్డేట్స్తో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది యువ లగ్జరీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. 2024 క్యూ4లో మొదటి డెలివరీలు వచ్చే అవకాశం ఉంది.
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2
తన సూపర్ లగ్జరీ ఎస్యూవీ కల్లినన్ సిరీస్ 2కి చెందిన అప్డేటెడ్ వర్షెన్‌ని భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది రోల్స్ రాయిస్. కస్టమైజేషన్ ఆప్షన్లను జోడించడంతో రూ.10.5 కోట్ల ప్రారంభ ధరతో కల్లియన్ సిరీస్ 2ను ప్రవేశపెట్టింది ఈ దిగ్గజ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ. భారతీయ లగ్జరీ పోకడలు, కస్టమర్ ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు రోల్స్ రాయిస్ తెలిపింది.
ఎక్కువ మంది రోల్స్ రాయిస్ క్లయింట్లు పట్టణ కేంద్రాల్లో స్థిరపడటంతో, కల్లినన్ సిరీస్ 2 ఇప్పుడు యువ ప్రేక్షకులను సంతృప్తి పరిచేవిధంగా అప్డేట్స్ పొందింది. ఆధునిక నగరాల్లోని ప్రకాశవంతమైన స్కైస్కేపర్స్ స్ఫూర్తితో డిజైన్ నవీకరణలను రూపొందించినట్లు తయారీదారు చెప్పింది. డ్యాష్‌బోర్డు మీద 7వేల డాట్స్ వస్తాయి. వీటిని వివిధ యాంగిల్స్‌లో లేజర్ ఎచ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ గ్లాస్ డిజైన్‌కి మరింత డెప్త్ చేరినట్టు అయ్యింది.
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2: డిజిటల్ అప్‌గ్రేడ్..
కల్లినన్ సిరీస్ 2 ఇప్పుడు డ్యాష్‌బోర్డు పై భాగంలో పిల్లర్-టు-పిల్లర్ గ్లాస్ ప్యానెల్‌ని కలిగి ఉంది. ఇది రోల్స్ రాయిస్ సాధారణంగా దృష్టి సారించే భౌతిక హస్తకళతో పాటు డిజిటల్ హస్తకళను ప్రదర్శిస్తుంది.
డిజిటల్ అప్‌గ్రేడ్స్‌లో 18-స్పీకర్ల ఆడియో సిస్టమ్, వై-ఫై హాట్ స్పాట్ కనెక్షన్, ప్రతి స్క్రీన్ కోసం ఇండిపెండెంట్ స్ట్రీమింగ్ వంటి అప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా రియర్ సీట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని కనెక్ట్ చేసే ఆప్షన్ని కూడా ఇప్పుడు చేర్చారు. డ్రైవర్ డిస్ప్లేలో మరింత మెరుగుపరిచారు.
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2: బ్లాక్ బ్యాడ్జ్
రోల్స్ రాయిస్ ప్రొడక్ట్ లైనప్‌లో అత్యంత డిమాండ్ ఉన్న మోడళ్లలో కల్లినన్ సిరీస్ 2 ఎస్యూవీ ఒకటి. బ్లాక్ బ్యాడ్జ్ అనేది ఈ లగ్జరీ ఎస్యూవీ బోల్డ్, స్పోర్టియర్ వెర్షన్. మరింత ప్రత్యేకంగా నిలవాలని భావించే కస్టమర్ల కోసం దీనిని సంస్థ రూపొందించింది.
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2: ధర, లభ్యత..
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2 భారతదేశంలో రూ .10.5 కోట్ల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరీస్ 2 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.12.25 కోట్లు. భారతీయ వినియోగదారులకు మొదటి డెలివరీలు 2024 నాల్గొవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు తమ కల్లినన్ సిరీస్ 2, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్లను దేశంలోని రెండు షోరూమ్‌లు - రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చెన్నై, దిల్లీలో పర్సనలైజ్ చేసుకునే అవకాశం ఉంది.