తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kolkata Doctor: ‘‘అది గ్యాంగ్ రేప్ కాదు.. సంజయ్ రాయ్ ఒక్కడే అనుమానితుడు’’: సీబీఐ క్లారిటీ

Kolkata doctor: ‘‘అది గ్యాంగ్ రేప్ కాదు.. సంజయ్ రాయ్ ఒక్కడే అనుమానితుడు’’: సీబీఐ క్లారిటీ

Sudarshan V HT Telugu

06 September 2024, 19:37 IST

google News
  • దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి, దేశప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైన కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. అయితే, తాజాగా, కోల్ కతా లోని ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదని, ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే అనుమానితుడని సీబీఐ నిర్ధారించింది.
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్ (HT_PRINT)

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్

కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న వాదనను సీబీఐ తోసిపుచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ను ఏకైక నిందితుడిగా నిర్ధారించింది.

అందుబాటులో ఉన్న సాక్ష్యాలతో..

అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు సంజయ్ రాయ్ ను మాత్రమే నిందితుడిగా చూపుతున్నాయని, దర్యాప్తు ప్రస్తుతం తుది దశలో ఉందని, త్వరలోనే అభియోగాలు నమోదు చేయడానికి ఏజెన్సీ సిద్ధంగా ఉందని పేరు వెల్లడించని సీబీఐ వర్గాలు తెలిపాయి. కోల్కతా పోలీసుల నుంచి ఈ కేసు విచారణను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును నత్తనడకన సాగిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) సీబీఐపై విమర్శలు కూడా చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించి 16 రోజులు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆమె అన్నారు. సీబీఐ కన్నా కోల్కతా పోలీసులు ఈ కేసుపై మరింత క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఎయిమ్స్ కు మెడికల్ రిపోర్ట్

అనుమానిత నిందితుల డీఎన్ఏ వివరాలతో కూడిన మెడికల్ రిపోర్టును దర్యాప్తు కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు సీబీఐ పంపిందని తెలుస్తోంది. ఆగస్టు 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యలో సంజయ్ రాయ్ మినహా మరెవరి ప్రమేయం లేదని సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

100కు పైగా వాంగ్మూలాలు, 10 పాలీగ్రాఫ్ పరీక్షలు

సీబీఐ (cbi) ఇప్పటి వరకు 100కు పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, నిందితులపై 10 పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ పై ఆర్థిక అవకతవకలపై అభియోగాలు మోపారు. ఈ కేసు తీవ్ర దుమారం రేపగా, న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు, పౌరులు ఆందోళనలు చేపట్టారు.

తదుపరి వ్యాసం