తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ratan Tata's Final Journey: పార్సీ సంప్రదాయం ప్రకారం కాకుండా, దహన వాటికలో రతన్ టాటా అంత్య క్రియలు

Ratan Tata's final journey: పార్సీ సంప్రదాయం ప్రకారం కాకుండా, దహన వాటికలో రతన్ టాటా అంత్య క్రియలు

Sudarshan V HT Telugu

10 October 2024, 15:27 IST

google News
  • Ratan Tata's final journey: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. పార్సీ మతానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియలు పార్సీ సంప్రదాయం ప్రకారం కాకుండా, వర్లీ లోని విద్యుత్ దహనవాటికలో జరగనున్నాయి. పార్సీ కమ్యూనిటీలోని ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు.

రతన్ టాటా
రతన్ టాటా (AFP)

రతన్ టాటా

Ratan Tata's final journey: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. దార్శనిక నాయకత్వం, సామాజిక బాధ్యత పట్ల లోతైన నిబద్ధతకు పేరుగాంచిన రతన్ టాటా.. టాటా గ్రూప్ ను గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే కాకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చారు. ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది.

ఎన్సీపీఏ గ్రౌండ్ కు..

రతన్ టాటా (ratan tata) పార్థివదేహాన్ని గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై దక్షిణ ముంబైలోని ఎన్సీపీఏకు తరలించారు. ముంబైలోని వర్లీ శ్మశానవాటికలోని దహనవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా పార్థివదేహాన్ని అంతిమ యాత్రకు తీసుకెళ్తామని టాటా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

పార్సీ సంప్రదాయం ప్రకారం కాకుండా..

వర్లీలో రతన్ టాటా అంత్యక్రియలు పార్సీ సంప్రదాయం ప్రకారం జరగడం లేదు. సాధారణంగా, ముంబైలో పార్సీ కమ్యూనిటీలో ఎవరైనా చనిపోతే, ఆ మృతదేహాన్ని మలబార్ హిల్ లోని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా డూంగర్వాడికి తరలించి, అక్కడ వదిలేస్తారు. అయితే, రతన్ టాటా అంత్యక్రియలకు ఆ పార్సీ సంప్రదాయ విధానం కాకుండా, వర్లీ స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించారు.

రతన్ టాటా పార్సీ మూలాలు

రతన్ టాటా వ్యాపార ప్రపంచంలోనే కాకుండా పార్సీ కమ్యూనిటీలో కూడా ప్రముఖ వ్యక్తి. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పార్సీ కమ్యూనిటీ భారతదేశంలోని అతిచిన్నదే కానీ అత్యంత ప్రభావవంతమైన మత మైనారిటీలలో ఒకటి. వీరిలో టాటా విశిష్ట సభ్యుడు. సమాజం కోసం ఉదారంగా విరాళాలు అందించిన వ్యక్తిగా ఆయనను స్మరించుకుంటూ పలు ప్రముఖ పార్శీ పత్రికలు ఈ ఉదయం ఆయన మృతికి సంతాపం తెలిపాయి. జొరాస్ట్రియన్ రిటర్న్ టు రూట్స్ ప్రోగ్రామ్ కు రతన్ టాటా ఉదారంగా మద్దతు ఇస్తున్నారని వెల్లడించాయి. యువ జోరాస్ట్రియన్లకు ఆయన గొప్ప రోల్ మోడల్ అని పేర్కొన్నాయి.

మారుతున్న పార్శీ సంప్రదాయాలు

సాంప్రదాయకంగా, జొరాస్ట్రియన్లు తమవారి మృతదేహాలను "స్కై శ్మశానం" అని పిలిచే విధానంలో టవర్ ఆఫ్ సైలెన్స్ (దఖ్మా) లో ఉంచుతారు. ఆ మృతదేహాలు సహజంగా భూమిలో కలిసిపోవడంతో పాటు పక్షులను, ప్రధానంగా రాబందులకు ఆహారమవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో రాబందుల సంఖ్య తగ్గడంతో, పార్శీ (parsi) కమ్యూనిటీకి చెందిన ఎక్కువ మంది సభ్యులు సాంప్రదాయ టవర్ ఆఫ్ సైలెన్స్ కంటే దహన సంస్కారాలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు, అన్ని పార్శీ అంత్యక్రియలలో 15 నుండి 20% వరకు శ్మశాన వాటికలలో జరుగుతున్నాయి. సంప్రదాయ పార్సీలు ఇప్పటికీ స్మశాన వాటికల్లో దహన సంస్కారాలను వ్యతిరేకిస్తున్నారు. పార్సీ కమ్యూనిటీకి చెందిన మరో ప్రముఖ సభ్యుడు సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా 2022లో వర్లీ శ్మశానవాటికలో జరిగాయి.

రతన్ టాటా అంత్యక్రియలు

రతన్ టాటా (Ratan Tata) పార్థివదేహాన్ని గురువారం తెల్లవారుజామున పోలీసు వాహనాలతో కూడిన అంబులెన్స్ లో ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చి కొలాబాలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్సీపీఏలో ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన పార్థివదేహాన్ని వర్లీ శ్మశానవాటికకు తరలించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో సంతాప దినాన్ని ప్రకటించిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

తదుపరి వ్యాసం