తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ratan Tata: ‘‘వివాహం, కుటుంబం, పిల్లలు లేనందువల్ల చాలాసార్లు ఒంటరితనం ఫీల్ అయ్యాను’’- రతన్ టాటా

Ratan Tata: ‘‘వివాహం, కుటుంబం, పిల్లలు లేనందువల్ల చాలాసార్లు ఒంటరితనం ఫీల్ అయ్యాను’’- రతన్ టాటా

Sudarshan V HT Telugu

10 October 2024, 15:57 IST

google News
  • Ratan Tata marriage: ముంబై ఆసుపత్రిలో బుధవారం రాత్రి చనిపోయిన భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యాపార జీవితంలో సాధించిన విజయాలు చాలా ఉన్నాయి.  అయితే, ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ముఖ్యంగా రతన్ టాటా వివాహం చేసుకోకపోవడానికిి కారణం చాలాకాలం పాటు రహస్యంగానే ఉంది. 

రతన్ టాటా ఒంటరితనం
రతన్ టాటా ఒంటరితనం (Instagram/@ratantata)

రతన్ టాటా ఒంటరితనం

Ratan Tata marriage: బిలియనీర్ బిజినెస్ టైకూన్ రతన్ టాటా వ్యాపార విజయాల గురించి చాలా తెలిసినప్పటికీ, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు చాలా సంవత్సరాలుగా గోప్యంగా ఉన్నాయి. ముఖ్యంగా అవివాహితుడిగానే ఎందుకు ఉండపోయాడన్న విషయం సీక్రెట్ గానే చాన్నాళ్లు ఉండిపోయింది.

నాలుగు సార్లు తప్పిన పెళ్లి

2011లో సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా తన వివాహానికి సంబంధించిన పలు అంశాలు వెల్లడించారు. తన జీవితంలో నాలుగుసార్లు పెళ్లికి దగ్గరయ్యానని, కానీ వివిధ కారణాల వల్ల ప్రతిసారీ వెనక్కి తగ్గానని ఆయన వెల్లడించాడు. నాలుగుసార్లు పెళ్లికి దగ్గరగా వచ్చానని, ప్రతిసారీ భయంతోనో, వేరే ఏదో కారణంతోనో వెనక్కి తగ్గానని వెల్లడించారు. ‘‘ప్రతి సందర్భం భిన్నంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు కాదు. పెళ్లి జరిగి ఉంటే జీవితం మరింత సంక్లిష్టంగా ఉండేది’’ అని ఆ ఇంటర్వ్యూలో రతన్ టాటా వ్యాఖ్యానించారు. తన జీవితంలో నాలుగు సార్లు తీవ్రంగా ప్రేమలో పడ్డానని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చెప్పారు.

తొలి ప్రేమ

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయమైన ఓ అమెరికన్ మహిళతో తను మొదటి సారి ప్రేమలో పడ్డానని రతన్ టాటా (ratan tata) వెల్లడించారు. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా సీరియస్ గా ఉండేవాడినని చెప్పారు. అయితే, ఆ యువతి పరిచయమైన తరువాత, ఆమెను వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్ కావాలని భావించానని చెప్పారు. అయితే, తాను ఒక ప్రత్యేక కారణం వల్ల భారత్ కు తిరిగి వచ్చానన్నారు. ‘‘నానమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో, నేను ఇండియాకు తిరిగి వచ్చాను. ఆమె కూడా భారత్ రావాల్సి ఉంది. అయితే, అప్పుడే ఇండో-చైనా యుద్ధం ప్రారంభమైంది. దాంతో, ఆమె ఇండియా రాలేకపోయింది’’ అని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1962లో జరిగిన ఆ యుద్ధాన్ని భారత్, చైనాల మధ్య జరిగిన పెద్ద యుద్ధంగా అమెరికన్లు భావించారని, అందుకే ఆమె రాలేదని, ఆ తర్వాత అమెరికాలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిపారు.

ఒంటరిగా ఫీలవుతున్నాను

టీవీ హోస్ట్ సిమి గరేవాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండటం గురించి వెల్లడించారు. ‘‘భార్య లేకుండా, పిల్లలు లేకుండా, కుటుంబం లేకుండా.. మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?" అని సిమి గరేవాల్ రతన్ టాటాను అడిగింది. దానికి టాటా ఇలా సమాధానమిచ్చారు. ‘‘నన్ను ప్రేరేపించేది ఏమిటో నాకు తెలియదు. కానీ భార్య లేదా కుటుంబం లేనందుకు నేను చాలాసార్లు ఒంటరితనం ఫీల్ అయ్యాను. కొన్నిసార్లు నేను దాని కోసం ఆరాటపడ్డాను. కానీ మరికొన్నిసార్లు, మరొకరి భావాల గురించి లేదా మరొకరి ఆందోళనల గురించి ఆందోళన చెందకుండా నాకు లభించిన స్వేచ్ఛను నేను ఆస్వాదించాను" అని ఆయన వ్యాఖ్యానించారు. సిమి గరేవాల్ తో కూడా రతన్ టాటాకు ప్రత్యేక అనుబంధం ఉండేది.

తదుపరి వ్యాసం