Ratan Tata Quotes : భారత్ కోల్పోయిన 'రత్నం' రతన్ టాటా.. జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు
Ratan Tata Quotes : రతన్ టాటా మృతితో దేశం మెుత్తం బాధలో ఉంది. గొప్ప వ్యాపారవేత్తగానే కాదు.. విలువలు ఉన్న వ్యక్తిగా ఆయన ప్రజల మనసుల్లో ఉన్నారు. జీవితానికి సంబంధించి రతన్ టాటా కొన్ని మంచి మాటలు చెప్పారు. అవి అందరికీ ఉపయోగపడతాయి.
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా(86) కన్నుమూశారు. నమ్మకానికి మరోపేరు టాటా అనేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. రతన్ టాటా విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా. చాలా క్రమశిక్షణ, మంచి ప్రవర్తన కలిగిన మనిషి. మధ్యతరగతివారి గురించి ఆలోచించి.. లక్ష రూపాయల్లో కారు ఇవ్వాలనే సంకల్పాన్ని నెరవేర్చిన తొలి పారిశ్రామికవేత్త.
రతన్ టాటా ఇక లేరు కానీ ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రతన్ టాటా సింప్లిసిటీ ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. నిజంగా భారతదేశ 'రత్నం' కోల్పోయిందని చెప్పవచ్చు. ఆయన చెప్పిన కొన్ని మాటలు చూద్దాం..
- మనం మనుషులం, కంప్యూటర్లు కాదు.. జీవితాన్ని ఆస్వాదిద్దాం.. ఎప్పుడూ సీరియస్‌గా ఉండాల్సిన పని లేదు.
- జీవితంలో ముందుకు సాగడానికి ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈసీజీలో సరళరేఖ వస్తే మనం సజీవంగా లేమని అర్థం. జీవితం కూడా అంతే
- మనందరిలోనూ ఒకే రకమైన టాలెంట్ ఉండదు.. కానీ మన ప్రతిభను పెంపొందించుకోవడానికి మనందరికీ ఒకే రకమైన అవకాశాలు ఉన్నాయి.
- అధికారం, ధనం రెండూ నా ప్రధాన సూత్రాలు కాదు
- మీరు వేగంగా నడవాలనుకుంటే, ఒంటరిగా నడవండి.. కానీ మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే, కలిసి నడవండి.
- ప్రజలు మీపై రాళ్లు విసిరితే, ఆ రాళ్లను మీ ప్యాలెస్ నిర్మించడానికి ఉపయోగించండి.
- బాగా చదువుకుని కష్టపడి పనిచేసే మీ స్నేహితులను ఎప్పుడూ ఆటపట్టించకండి.. ఎందుకంటే ఏదో ఒకరోజు అతడి కింద పని చేయాల్సిన సమయం వస్తుంది.
- సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకుంటాను.. అది సరైనది అని రుజువు చేస్తాను.
- నేను ఎగరలేని రోజు నాకు విచారకరమైన రోజు.
- జీవితం టీవీ సీరియల్ లాంటిది కాదు.. నిజజీవితంలో విశ్రాంతి లేదు, పని మాత్రమే ఉంది.
- మీ జీవితం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది, దానికి అలవాటు పడండి.
రతన్ టాటా విజయాలు
టాటా గ్రూప్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీకి చేరుకుంది. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ బ్రాండ్ గా మారింది. టాటా నానో, టాటా ఇండికా ఆటోమొబైల్స్ ఆయన నాయకత్వంలోనే తయారయ్యాయి.
నానో కారు మధ్యతరగతి వారి కోసం ఆలోచించి తయారు చేసింది. ముంబై వీధుల్లో స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఓ కుటుంబాన్ని చూసి రతన్ టాటాకు నానో కారు ఆలోచన వచ్చింది. భారతదేశంలో ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే వాహనం ఉండాలని కోరుకున్నారు. లక్ష రూపాయలతో నానో కారును తీసుకొచ్చారు.
రతన్ టాటా దానంలోనూ ముందుంటారు. ఎన్నో విరాళాలు ఇచ్చారు. 9/11 దాడుల తర్వాత న్యూయార్క్ లోని టాటా గ్రూప్ ఉద్యోగుల గురించి చాలా ఆలోచించారు. ఈ దాడి తర్వాత అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ఇబ్బంది పడ్డారని, అందుకే రతన్ టాటా సాయం చేశారు. ఇది రతన్ సున్నితమైన, దయగల మనసుకు ఒక ఉదాహరణ మాత్రమే.