Ratan Tata Love Story : గుండెల్ని పిండేసే రతన్ టాటా లవ్‌స్టోరీ.. యుద్ధం విడదీసిన ప్రేమకథ
Ratan Tata Love Story In Telugu : రతన్ టాటా అనగానే అందరూ సక్సెస్‌ఫుల్ పర్సన్ అంటుంటారు. కానీ ఆయన జీవితంలో ఓ ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ కూడా ఉంది. పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు కారణమైంది. ఓ యుద్ధం రతన్ టాటా ప్రేమను విడదీసింది.
రతన్ టాటా అనేక విజయాలకు కేరాఫ్ అడ్రస్. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. ఇక సేవా గుణంలో ఆయనను మించిన వ్యాపారవేత్త లేడనే చెప్పుకొవచ్చు. సామాన్యుల కోసం ఆలోచించిన కోటీశ్వరుడిగా రతన్ టాటాకు పేరు ఉంది. యువతకు చెప్పేందుకు ఆయన జీవితంలోని చాలా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. కానీ రతన్ టాటా జీవితంలో ఓ ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంది. అదే ఆయన ప్రేమ కథ. ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే బాధ రతన్ టాటా జీవితంలో ఉండిపోయింది.
పారిశ్రామికవేత్తగానే కాదు.. వ్యక్తిగా రతన్ టాటా చాలా గొప్పవారు. జీవితంలో అనేక విజయాలను చూశారు. ఎంతో దాతృత్వం చేశారు. అసలు రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేవారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు ఆయనపై విమర్శలు చేసినది లేదు. తన పని తాను చేసుకుంటూ.. నలుగురికి సాయం చేస్తూ.. ఉద్యోగులను సరిగా చూసుకోవడమే ఆయన లైఫ్‌స్టైల్. సంపద ఎంత ఉన్నా సామాన్యుడిలా బతికినా కోటీశ్వరుడు. కానీ ఆయన జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీనికి ఓ కారణం ఉంది. ప్రేమలో ఆయన విఫలమయ్యారు. ఆ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం..
రతన్ టాటా అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో చదువు తర్వాత ఉద్యోగం మెుదలుపెట్టారు. ఈ సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆమె అంటే చాలా ఇష్టపడేవారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆమె కూడా ఆయనను ప్రేమించింది. ఇంట్లో పెద్దవాళ్లకు ఈ విషయం చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఓకే అన్నారు. కానీ ఇదే సమయంలో ఓ సమస్య వచ్చి పడింది.
1962లో భారత్ చైనా యుద్ధం వచ్చింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల్లో భయం మెుదలైంది. భారత్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదనే ఆలోచనల్లో పడ్డారు. అక్కడకు తమ కూతురిని పంపితే ఎలా ఉంటుందోనని అనుకున్నారు. మరోవైపు అదే సమయంలో రతన్ టాటా నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఆరోగ్యం సరిగా లేదు. దీంతో రతన్ టాటా భారత్‌కు రావాల్సి వచ్చింది.
కానీ ఇక్కడే వీరి లవ్ స్టోరీ ఎండ్ అయింది. తిరిగి అమెరికా వెళ్లిన రతన్ టాటా ఊహించని విషయం తెలిసింది. తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేశారు. దీంతో రతన్ టాటాకు ఏం చేయాలో తోచలేదు. తర్వాత ఇండియాకు వచ్చేశారు. పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రుల్లో మెుదలైన భయంతో రతన్ టాటా లవ్ స్టోరీ ముగిసింది.
కానీ ఈ విషయంపై రతన్ టాటా ఎవరినీ ఎప్పుడూ నిందించలేదు. పరిస్థితులే తన ప్రేమ కథ పెళ్లి వరకూ రాకుండా చేశాయని చెప్పేవారు. ఓ ఇంటర్వ్యూలో తనకు భార్య, పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరిగా అనిపిస్తుందని కూడా చెప్పారు. వివాహం జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం కూడా ఒక కారణమని రతన్ టాటా చెప్పారు. తాను కొన్నిసార్లు ప్రయత్నించినా.. వర్కౌట్ కాలేదన్నారు. దీంతో పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు.
టాపిక్