Ratan Tata: రతన్ టాటా మృతి పట్ల భారత క్రీడాకారులు సంతాపం, దిగ్గజాన్ని కోల్పోయామంటూ భావోద్వేగం
భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల భారత క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. రతన్ టాటా అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ.. ప్రపంచంలోని ఎందరికో ఆయన స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ముంబైలోని బ్రీజ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా తుదిశ్వాస విడిచారు.
అస్వస్థతతో ఆదివారం ఆస్పత్రిలో చేరిన రతన్ టాటాకి సోమవారం యాంజియోగ్రఫీ చేయగా గుండె కొట్టుకునే వేగం పెరిగి పరిస్థితి విషమించింది. లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స కొనసాగించినా.. బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు.
వాస్తవానికి రెండు రోజుల క్రితమే.. తనకి ఆరోగ్యం బాగుందని అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రతన్ టాటా ఓ ప్రకటనని కూడా విడుదల చేశారు. కానీ.. రెండు రోజుల్లోనే తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.
రతన్ టాటా మృతి పట్ల భారత క్రీడాకారులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.
‘‘రతన్ టాటా జీవితం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఓం శాంతి" అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాళి అర్పించారు.
‘‘రతన్ టాటా నాయకత్వం, వినయం, నైతికత విలువల పట్ల అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఆయన వారసత్వం ఆయన సృష్టించిన కంపెనీలకే కాదు, తన కరుణ, ఔదార్యంతో స్పృశించిన అసంఖ్యాక వ్యక్తులకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా ప్రగాఢ సంతాపం’’ అని హర్భజన్ సింగ్ రాసుకొచ్చాడు.
‘‘దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు, అద్భుతమైన రోల్ మోడల్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శ్రేయోభిలాషులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’’ అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు.
సెహ్వాగ్, హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్ తదితర క్రికెటర్లు కూడా రతన్ టాటాకు నివాళులర్పించారు.