Haryana Election Results: హర్యానాలో ఎమ్మెల్యే అభ్యర్థికి సెహ్వాగ్ ప్రచారం.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
Virender Sehwag: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు. ఈరోజు ఎన్నికల ఫలితాల్లో ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేశాడు. దాంతో.. అతను గెలిచాడా? అని నెటిజన్లు శోధిస్తున్నారు.
తోషామ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరికి మద్దతుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్.. అతనికి మద్దతుగా నిలవాల్సిందిగా ఓటర్లకి పిలుపునిచ్చాడు. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా సెహ్వాగ్ రిలీజ్ చేశాడు. అనిరుధ్ చౌదరిని తాను అన్నగా భావిస్తానని, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన అతని తండ్రి రణ్ బీర్ సింగ్ మహేంద్ర తనకు ఎంతో సపోర్ట్ చేశారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
మాజీ సీఎం వారుసుల మధ్య పోరు
నాలుగు సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన బన్సీలాల్ మనవడే ఈ అనిరుధ్ చౌదరి. వాస్తవానికి తోషామ్ లో అతనికి ఫ్యామిలీ నుంచే గట్టి పోటీ ఎదురైంది. బన్సీలాల్ చిన్న కుమారుడు సురేందర్ సింగ్ కుమార్తె శ్రుతి చౌదరి కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గంలో బరిలోకి దిగింది. దాంతో ఆ నియోజకవర్గంలో వాడీవేడీగా ప్రచారం సాగింది.
బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను అని కూడా సెహ్వాగ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ సపోర్ట్ లభించడంతో.. అనిరుధ్ చౌదరి గెలుస్తాడని అంతా అనుకున్నారు. అయితే.. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో శ్రుతి చౌదరి విజయం సాధించింది.
కాంగ్రెస్‌కి తప్పని నిరాశ
బన్సీలాల్ కుటుంబానికి తోషామ్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. సురేందర్ సింగ్, ఆయన సతీమణి కిరణ్ చౌదరి కూడా పలుమార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ చౌదరి అక్కడ గెలుపొందారు. కానీ 2024లో కాంగ్రెస్‌కి అక్కడ పరాజయం తప్పలేదు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం శ్రుతి చౌదరికి 43,338 ఓట్లురాగా.. అనిరుధ్ చౌదరికి 34,673 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు దాదాపు చివరి దశకి వచ్చేయడంతో శ్రుతి చౌదరి గెలవడం లాంఛనమే. సెహ్వాగ్ సపోర్ట్ చేసినా.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి నిరాశే ఎదురైంది.