HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Group: మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త; రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్

WhatsApp group: మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త; రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్

Sudarshan V HT Telugu

11 September 2024, 19:52 IST

  • వాట్సాప్ గ్రూప్ లు ఇప్పుడు కామన్ గా మారాయి. వాటిలో కూడా ఇప్పుడు మోసపూరిత గ్రూప్స్ ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్ లాభాలు, వ్యాపారంలో వృద్ధి వంటి ఆర్థికపరమైన ఆశలు చూపుతూ వచ్చే వాట్సాప్ గ్రూప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలాగే, ఓ పుణె డాక్టర్ మోసపూరిత ట్రేడింగ్ స్కీమ్ లో రూ .1.2 కోట్లు కోల్పోయాడు.

మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త
మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త (Pexels)

మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త

భారతదేశంలో ఆన్ లైన్ స్కామ్స్, సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది మోసపూరిత ఆన్ లైన్ స్కీమ్స్ బారిన పడి భారీగా నష్టపోతున్నారు. వారిలో విద్యావంతులు కూడా ఉండడం విశేషం. పుణెకు చెందిన ఓ ఆర్మీ వైద్యుడు మోసపూరిత ట్రేడింగ్ స్కీమ్ ద్వారా సైబర్ (cybercrime) నేరగాళ్ల చేతిలో రూ.1.2 కోట్లు పోగొట్టుకున్నాడు.

కుంభకోణం ఎలా మొదలైంది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుంభకోణం జూలై మధ్యలో ప్రారంభమైంది. వాట్సాప్ గ్రూప్ లో చేరాలంటూ పుణెకు చెందిన ఒక డాక్టర్ కు ఓ లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులపై అధిక రాబడులు వచ్చేలా చేస్తామని అందులో ఆశ చూపారు. దాంతో ఆ డాక్టర్ వాట్సాప్ గ్రూప్ లో చేరాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని, వాటిపై అత్యధిక లాభం వచ్చేలా చూస్తామని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు ఆయనకు హామీ ఇచ్చారు. దాంతో, ఆ డాక్టర్ వారు చెప్పిన ట్రేడింగ్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు.

మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ ఫామ్

అయితే, వారు సూచించిన ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ మోసపూరితమైనది. ఈ అప్లికేషన్ డబ్బును దొంగిలించడానికి వారే ప్రత్యేకంగా రూపొందించిన యాప్. సుమారు 40 రోజుల వ్యవధిలో రూ.1.22 కోట్లను వారు సూచించిన విధంగా వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేశాడు. ఆ డాక్టర్ పెట్టుబడి పెట్టిన మొత్తం 10 రెట్లు పెరిగి, రూ.10.26 కోట్లకు చేరుకుందని ఆ నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ లో చూపించారు.

విత్ డ్రా చేసుకోలేక..

ఆ డాక్టర్ ఒకసారి ఆ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ నుంచి స్టాక్స్ అమ్మి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు. దాంతో గ్రూప్ అడ్మిన్ లను సంప్రదించగా, వారు డబ్బులు విడుదల చేసేందుకు రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ, ఆ డబ్బులు ఇవ్వకపోతే, మీ మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారని ఆ డాక్టర్ ను వారు బెదిరించారు.

పోలీసులకు ఫిర్యాదు

దీంతో అనుమానం వచ్చిన ఆ డాక్టర్ వారిని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిజిస్టర్డ్ అడ్రస్ కోరాడు. న్యూఢిల్లీలో ఉందని వారు ఇచ్చిన చిరునామా దర్యాప్తులో కల్పితమని తేలింది. దాంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయడంతో పుణె సిటీ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.

టెలీగ్రామ్, వాట్సాప్ ల్లో..

నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్స్ తో మోసం చేసే స్కామర్స్ ప్రధానంగా టెలీగ్రాం (telegram), వాట్సాప్ (whatsapp) వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఆధారపడుతున్నారు. అధిక లాభాలను ఆశ చూపి పెట్టుబడులు పెట్టేలా ఆకట్టుకుంటున్నారు. చివరకు, వారిని లక్షలు, లేదా కోట్లలో ముంచుతున్నారు.

ఇలాంటి కుంభకోణాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

అధికారిక ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండా షేర్ల కొనుగోళ్లు, ఐపీఓ సబ్ స్క్రిప్షన్లు, సంస్థాగత ఖాతా ప్రయోజనాలు వంటి ప్రత్యేక ప్రయోజనాలను ఈ మోసపూరిత యాప్ లు తరచూ వాగ్దానం చేస్తాయని సెబీ హెచ్చరిస్తోంది. మోసగాళ్లు సాధారణంగా తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తారు. అందువల్ల..

  • మూలాలను ధృవీకరించండి: ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేయడానికి ముందు విశ్వసనీయ వనరుల ద్వారా పెట్టుబడి అవకాశాల చట్టబద్ధతను ధృవీకరించండి.
  • తెలియని లింకుల పట్ల జాగ్రత్త: అవాంఛిత సందేశాల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయడం మానుకోండి, ముఖ్యంగా అధిక రాబడిని ప్రోత్సహించేవి.
  • వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించండి: వ్యక్తిగత, ఆర్థిక వివరాలను ఆన్ లైన్ లో, ముఖ్యంగా తెలియని వ్యక్తులతో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్