Anil Ambani : అనిల్ అంబానీపై సెబీ కఠిన చర్యలు- మార్కెట్ల నుంచి 5ఏళ్ల నిషేధం!
Anil Ambani SEBI : నిధుల మళ్లింపుపై అనిల్ అంబానీతో పాటు 24 సంస్థలపై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. రూ. 25కోట్ల జరిమానా కట్టాలని స్పష్టం చేసింది.
కంపెనీ నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలపై పారిశ్రామికవేత్త అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠిన చర్యలు తీసుకుంది. వీరితో పాటు మరో 24 సంస్థలపై ఐదేళ్ల నిషేధాన్ని విధించింది.
అంతేకాదు అనిల్ అంబానీకి సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఏ లిస్టెడ్ కంపెనీలోనైనా డైరెక్టర్ లేదా కీ మేనేజిరియల్ పర్సనల్ (కేఎంపీ) లేదా మార్కెట్ రెగ్యులేటర్ వద్ద నమోదైన మధ్యవర్తి పొజీషన్ సహా సెక్యూరిటీస్ మార్కెట్‌తో 5 సంవత్సరాల పాటు సంబంధం కలిగి ఉండకుండా తేల్చిచెప్పింది.
అనిల్ అంబానీపై సెబీ చర్యలు..
ఆర్హెచ్ఎఫ్ఎల్ కీలక నిర్వహణ సిబ్బంది సహాయంతో అనిల్ అంబానీ తనకు సంబంధించిన సంస్థలకు రుణాలు ఇస్తున్నట్టు చెప్పి, నిధులను మళ్లించడానికి మోసపూరిత పథకం రచించారని 222 పేజీల తుది ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి రుణ పద్ధతులను నిలిపివేయాలని ఆర్హెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ల బోర్డు చెప్పినప్పటికీ, కంపెనీ యాజమాన్యం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని, అనిల్ అంబానీ ప్రభావంతో కొందరు కీలక నిర్వాహకులు పాలనలో గణనీయమైన వైఫల్యానికి ఇది సూచిస్తోందని సెబీ పేర్కొంది.
అనిల్ అంబానీ 'ఏడీఏ గ్రూప్ చైర్పర్సన్'గా తన స్థానాన్ని ఉపయోగించుకున్నట్లు సెబీ చెప్పింది.
“నోటీసీ నెం.2 (అనిల్ అంబానీ) ఆర్హెచ్ఎఫ్ఎల్ కేఎంపీలు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి నిధులను మళ్లించేందుకు ప్రయత్నించారు. అర్హత లేని వారికి రుణాలు ఇచ్చినట్టు చూపించి,ప్రతిగా రుణగ్రహీతలకు నిధులను మళ్లించారు. 'ప్రమోటర్ లింక్డ్ సంస్థలు' అనగా నోటీసు 2 (అనిల్ అంబానీ)తో సంబంధం ఉన్నవి,” అని సెబీ పేర్కొంది.
అనిల్ అంబానీ 'ఏడీఏ గ్రూప్ ఛైర్పర్సన్'గా తన పదవిని, ఆర్హెచ్ఎఫ్ఎల్ హోల్డింగ్ కంపెనీలో తనకున్న గణనీయమైన పరోక్ష వాటాను ఈ మోసానికి ఉపయోగించుకున్నారు.
హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ హెచ్ ఎఫ్ ఎల్) మాజీ కీలక అధికారులు అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేశ్ ఆర్ షా సహా 24 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. అంబానీకి రూ.25 కోట్లు, బాప్నాకు రూ.27 కోట్లు, సుధాల్కర్కు రూ.26 కోట్లు, షాకు రూ.21 కోట్లు జరిమానా విధించింది.
రిలయన్స్ యూనికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్ట్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మిగిలిన సంస్థలకు రూ .25 కోట్ల చొప్పున జరిమానా విధించింది.
సంబంధిత కథనం