Telegram : టెలిగ్రామ్‌‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు అనుమతి.. సీఈవో దురోవ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు-telegram ceo pavel durov allowed child pornography drug trafficking on messaging app french court rules details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Telegram : టెలిగ్రామ్‌‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు అనుమతి.. సీఈవో దురోవ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Telegram : టెలిగ్రామ్‌‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు అనుమతి.. సీఈవో దురోవ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Anand Sai HT Telugu
Aug 29, 2024 01:27 PM IST

Telegram Issue : టెలిగ్రామ్ సీఈవో దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మెల్లమెల్లగా చాలా విషయాల్లో ఆయన ఇరుక్కుపోతున్నట్టుగా అర్థమవుతోంది. యాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫింగ్‌కు సీఈవో అనుమతి ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

పావెల్ దురోవ్
పావెల్ దురోవ్

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణకు టెలిగ్రామ్‌లో అనుమతించినట్టుగా తేలింది. దీంతో దురోవ్ మరింత ఇరుక్కుపోయినట్టుగా అయింది. ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు కూడా జరిగాయని, వీటి వ్యాప్తిని అరికట్టడంలో సీఈవో విఫలమయ్యారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో దీనికి సంబంధించిన కేసులోనూ అతడు విచారణ ఎదుర్కోవలసి ఉంది.

పావెల్ దురోవ్‌ను పారిస్ వెలుపల ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఆగష్టు 24 శనివారం అరెస్టు చేశారు. తర్వాత దురోవ్ 5 మిలియన్ యూరోల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల అయ్యారు. ఫ్రాన్స్‌లో ఉండి వారానికి రెండుసార్లు స్టేషన్‌లో రిపోర్టు చేయాలనే షరతుపై బయటకు వచ్చారు. దేశం విడిచి పెట్టి బయటకు వెళ్లేందుకు అనుమతి కూడా లభించలేదు. అతడిపై విచారణకు సంబంధించి ప్రాథమిక అభియోగాలు కూడా నమోదయ్యాయి.

మరోవైపు దురోవ్.. టెలిగ్రామ్ సమాచారాన్ని పంచుకోవడం, మనీలాండరింగ్, నేరస్థులకు క్రిప్టోగ్రాఫిక్ సేవలను అందించడం గురించి అధికారులతో సహకరించడానికి నిరాకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అనుమానితులపై చట్టపరమైన వైర్ ట్యాప్‌ నిర్వహించేందుకు కూడా దురోవ్ నిరాకరిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

దీంతో అతడిపై అనుమానాలు ఎక్కువ అయ్యాయి. అతడిపై టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతి ఇచ్చారని అభియోగాలు మోపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అనుమతించడంతోపాటు, మెసేజింగ్ యాప్‌ ఉల్లంఘనలకు సంబంధించి దురోవ్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

దురోవ్‌కు అనేక దేశాల పౌరసత్వం ఉంది. టెలిగ్రామ్‌కు మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. దీంతో ఈ సమస్య అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. మరోవైపు పావెల్ దురోవ్, అతని మాజీ భాగస్వామి పారిస్‌లో ఉన్నప్పుడు అతని పిల్లలలో ఒకరి పట్ల తీవ్రమైన హింసాత్మక చర్యలకు పాల్పడ్డారనే అనుమానంతో కూడా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. గతేడాది స్విట్జర్లాండ్‌లో దురోవ్‌పై ఆమె మరో ఫిర్యాదు కూడా చేసింది. మెుత్తానికి టెలిగ్రామ్ సీఈవో చుట్టూ మెల్లమెల్లగా ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

Whats_app_banner