Telegram Ban : టెలిగ్రామ్‌ను భారత్‌లో బ్యాన్ చేస్తారా? ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా?
Telegram Ban : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను భారతదేశంలో నిషేధిస్తారా? దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెలిగ్రామ్ యాప్ మీద భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా టెలిగ్రామ్ మీద బ్యాన్ విధించే అవకాశం ఉంది.
మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను దోపిడీ, జూదం వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆందోళనలపై భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆధారంగా చేసుకుని యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) టెలిగ్రామ్ యాప్‌పై దర్యాప్తు చేస్తోంది. టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ ఆగస్టు 24న ప్యారిస్‌లో.. తన యాప్ మోడరేషన్ విధానాలపై అరెస్టయ్యారు. అయితే ఈ అరెస్టును టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్, ఎడ్వర్డ్ స్నోడెన్ తప్పుబట్టారు.
భారతదేశంలో టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయాలా? వద్దా? అనే విషయం దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
భారతదేశంలో 5 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌ను నిషేధించడాన్ని తోసిపుచ్చలేమని ఓ అధికారి తెలిపారు. అయితే దర్యాప్తుపై ఆధారపడి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో టెలిగ్రామ్‌తో సహా కొన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పౌరులకు నష్టాన్ని కలిగించే స్కామ్‌లతో సహా నేరపూరిత కార్యకలాపాలకు నిలయంగా మారాయి.
UGC-NEET వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లో నిలిచింది. ఇది నిరసనలకు దారితీసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయింది. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్‌లో విస్తృతంగా షేర్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పేపర్‌ను రూ. 5,000 నుండి రూ. 10,000 మధ్య అమ్మినట్టుగా వార్తలు వచ్చాయి.
భారతదేశంలో టెలిగ్రామ్ దర్యాప్తును ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. అక్టోబర్‌లో IT మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్, కొన్ని ఇతర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వారి ప్లాట్‌ఫారమ్‌ల నుండి పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM)ను తొలగించాలని ఆదేశించింది.
అయితే తాజాగా టెలిగ్రామ్ దోపిడీ, జూదం వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.