‘‘సోషల్ మీడియా స్టోరీస్ ఆధారంగా వాదనలు వినిపించవద్దు’’: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం-supreme court debunks 151 mg semen in kolkata doctors body theory ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘సోషల్ మీడియా స్టోరీస్ ఆధారంగా వాదనలు వినిపించవద్దు’’: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

‘‘సోషల్ మీడియా స్టోరీస్ ఆధారంగా వాదనలు వినిపించవద్దు’’: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 05:20 PM IST

కోల్ కతా రేప్-మర్డర్ కేసు విచారణలో సుప్రీంకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా వాదనలు వినిపించవద్దని, తమ వద్ద పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గందరగోళం చేయవద్దని కోరింది. కోర్టులో వాదనలు వినిపించడానికి సోషల్ మీడియాను వాడవద్దని సూచించింది.

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ శరీరంలో 151 ఎంజీ వీర్యం ఉందన్న వాదనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం తోసిపుచ్చారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు సంబంధించిన సుమోటో కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది.

సోషల్ మీడియా కథనాలు

విచారణ సందర్భంగా ఓ లాయర్ మాట్లాడుతూ.. బాధితురాలి శరీరంలోని వీర్యం గురించి పోస్ట్ మార్టం నివేదికలో ఏముందో వివరించబోతుండగా, సీజేఐ ఆయనను అడ్డుకున్నారు. ‘దీన్ని గందరగోళం చేయవద్దు. కోర్టులో వాదనలు వినిపించేందుకు సోషల్ మీడియాను వాడుకోవద్దు. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టు మా ముందే ఉంది. ఆ 151 అంటే ఏమిటో మాకు తెలుసు. మనం సోషల్ మీడియాలో వచ్చిన వాటిని వాడుకోవద్దు. వాటి ఆధారంగా కోర్టులో వాదనలు చేయొద్దు’’ అని స్పష్టం చేశారు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం లభ్యమైందని పలు సోషల్ మీడియా పోస్టులు, కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వదంతులు నమ్మవద్దు..

కాగా, కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన వదంతులు, కథనాలను ప్రజలు నమ్మవద్దని కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కోరారు. ప్రస్తుతం దర్యాప్తును నిర్వహిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ను విశ్వసించాలని ప్రజలను కోరారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరగిన విషయాన్ని దాచిపెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి పోలీసులు తెలియజేశారన్న వార్త కూడా అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం లభించిందన్నది కూడా తప్పుడు కథనం అన్నారు. ఈ కేసుపై సామాజిక మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం ఎందుకు?

మహిళా వైద్యురాలి అసహజ మరణాన్ని నమోదు చేయడంలో కోల్ కతా పోలీసులు జాప్యం చేయడం చాలా బాధాకరమని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఎందుకు జాప్యం జరిగిందో తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే, ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి నిరసన తెలుపుతున్న వైద్యులను తిరిగి విధుల్లోకి వెళ్లాలని ఆదేశించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది. ఆగస్టు 9న సాయంత్రం 6.10 గంటల నుంచి 7.10 గంటల మధ్య, ట్రైనీ డాక్టర్ మృతిని అసహజ మరణంగా పేర్కొంటూ, కేసు నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆ ఆఫీసర్ హాజరు కావాలి

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్ కతా డాక్టర్ అత్యాచారం-హత్యపై మొదటి ఎంట్రీ నమోదు చేసిన కోల్ కతా పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరై కచ్చితమైన ఎంట్రీ సమయాన్ని వెల్లడించాలని ఆదేశించింది. బాధితురాలి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అత్యంత దిగ్భ్రాంతికరమైన వాస్తవమని సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.