Telegram CEO arrested : ఫ్రాన్స్‌లో టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్.. అసలు కారణం ఏంటి?
Telegram CEO Pavel Durov arrested : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ జెట్ ద్వారా దేశంలో ల్యాండ్ అయిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్‌కి ఉత్తరాన ఉన్న లే బొర్గెట్ విమానాశ్రయంలో పావెల్ తన ప్రైవేట్ జెట్‌తో ల్యాండ్ అయిన వెంటనే, స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పోలీసులు ఆయన్ని అదుపులోకీ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ మీడియా వెల్లడించింది.
టెలిగ్రామ్ సీఈఓని ఎందుకు అరెస్ట్ చేశారు?
39ఏళ్ల టెలిగ్రామ్ సీఈఓ, బిలియనీర్ పావెల్ దురోవ్ అరెస్ట్‌కి అసలు కారణాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ టెలిగ్రామ్ యాప్‌నకు సంబంధించిన 'అఫెన్స్'లపై వారెంట్‌తో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. టెలిగ్రామ్ యాప్‌లో మాడరేటర్లు లేనందున నేర కార్యకలాపాలను నియంత్రించడం కష్టమవుతుందని, ఇదే విషయంపై పోలీసులు గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నట్టు, ఇందులో భాగంగానే టెలిగ్రామ్ సీఈఓని తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ వార్తలపై టెలిగ్రామ్ యూనిట్ స్పందించలేదు. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్‌పై ఫ్రాన్స్‌లోని రష్యా ఎంబసీ స్పందించింది. పరిస్థితులపై అవగాహన, క్లారిటీ పొందేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. టెలిగ్రామ్ సిబ్బందితో మాట్లాడలేదని తెలిపింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది పావెల్ దురోవ్కి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. “నిజాన్ని సెన్సార్ చేయడం లేదన్న కారణంతోనే అరెస్ట్ చేశారు,” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలో ఉన్న దిగ్గజ సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్ ఒకటి. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్చాట్లకు సమానంగా టెలిగ్రామ్‌కు అనేక దేశాల్లో ఆదరణ లభిస్తోంది.
టెలిగ్రామ్‌ని రష్యాలో 2013లో పావెల్ దురోవ్ స్థాపించారు. రష్యా, ఉక్రెయిన్ సహా నాటి సోవియెట్ యూనియన్ దేశాల్లో ఈ యాప్ చాలా ఫేమస్. కానీ తన మరొక యాప్ అయిన వీకొంటక్టే (దీనిని ఆయన అమ్మేశారు)లో ప్రతిపక్షాల కమ్యూనిటీలను నిషేధించాలని రష్యా ప్రభుత్వం చేసిన ఒత్తిడితో 2014లో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్ కార్యకలాపాలు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యాయి.
"చాలా ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ అనేది ఒక తటస్థ వేదికగా ఉండాలి. భౌగోళిక రాజకీయాలకు బానిస అవ్వకూడదు," అని పావెల్ దురోవ్ గతంలో వ్యాఖ్యానించారు.
యూజర్ డేటాని పావెల్ ఇవ్వనందుకు 2018లో టెలిగ్రామ్‌పై రష్యా ప్రభుత్వం నిషేధం విధించింది. 2021లో నిషేధాన్ని ఎత్తివేసింది. వచ్చే ఏడాది నాటికి 1 బిలియన్ యూజర్ మార్క్‌ని తాకాలని టెలిగ్రామ్ లక్ష్యంగా పెట్టుకుంది.
'12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు..'
తనకు 12 దేశాల్లో వంద మందికి పైగా బయోలాజికల్ కిడ్స్ ఉన్నారంటూ ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ వార్తలకెక్కారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా తన సబ్స్క్రైబర్స్తో పంచుకున్నారు. వీర్యదానం ద్వారా 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యానని ఆ సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా కనుగొనడానికి వీలుగా తన డీఎన్ఏను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని టెలిగ్రామ్ సీఈఓ, బిలియనీర్ పావెల్ దురోవ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం