Ola Electric: భారత్ లో ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును నిలిపేసిన ఓలా.. లేటెస్ట్ ఐపీఓ నే కారణమా?
22 August 2024, 21:53 IST
- ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు 2022 లో ప్రకటించింది. కానీ, తాజాగా, ఆ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇందుకు లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఐపీఓనే కారణమని తెలిపింది.
భారత్ లో ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును నిలిపేసిన ఓలా
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును అధికారికంగా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఈవీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్.. మూడేళ్ల క్రితం భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించింది. అయితే, తాజాగా, ఆ ప్రాజెక్టను విరమిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈఓ భవీష్ అగర్వాల్ వెల్లడించారు.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ
ఈ నెల ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. దాంతో, ఇప్పుడు కంపెనీ లాభదాయకతపై మరింత దృష్టి పెట్టామని, ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ 2022 లో ఆల్ గ్లాస్ రూఫ్ తో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆగస్టు 15, 2022 న జరిగిన వార్షిక కార్యక్రమంలో తాము రూపొందించనున్న ఓలా ఎలక్ట్రిక్ కారు స్కెచ్ లు, వీడియోలను కూడా షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడానికి రెండేళ్లు పడుతుందని అప్పట్లో ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇటీవల, ఓలా ఎలక్ట్రిక్ ఈవిని అభివృద్ధి చేసే ప్రణాళికలను విరమించుకున్నట్లు నివేదికలు సూచించాయి. అయితే దాదాపు నెల రోజుల తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
4 సెకన్లలో 0 నుంచి 100 కిమీలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటా మోటార్స్ (tata motors) ముందంజలో ఉంది. మిగతా కార్ల తయారీ సంస్థలు కూడా ఈ దిశగా పలు ఎలక్ట్రిక్ మోడల్స్ ను విడుదల చేస్తున్నాయి. అయితే, భారత్ మార్కెట్లో ఈ సంస్థలకు సవాలు విసిరేలా సరికొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఓలా ఎలక్ట్రిక్ భావించింది. ఒకే ఛార్జింగ్ లో సుమారు 500 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగల, 4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే, అకస్మాత్తుగా ఆ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్లు వెల్లడించింది.
ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టును ఓలా ఎందుకు నిలిపివేసింది?
ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టును నిలిపివేయాలన్న ఓలా నిర్ణయాన్ని భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. ‘‘ప్రస్తుతం దానిపై కసరత్తు చేయడం లేదు. భారతదేశానికి అవసరమైన ఉత్పత్తులను నిర్మించడం, వాటిని పెద్ద ఎత్తున ప్రారంభించడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం మా విజన్. మేము ఆ దిశగానే వెళ్తున్నాము. ముందుగా, ద్విచక్ర వాహనాలు, తరువాత ఇతర ఉత్పత్తులు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీఓ (IPO)ను ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత భవిష్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోటార్ సైకిళ్లపై దృష్టి
ఎలక్ట్రిక్ స్కూటర్ ల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించింది.లేటెస్ట్ గా మూడు వేరియంట్లలో ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను రోడ్ స్టర్ సిరీస్ లో లాంచ్ చేసింది. వాటి ధర రూ.75,000 నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ రోడ్ స్టర్ ప్రో వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 579 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ధర దాదాపు రూ .2 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ (ola electric) స్కూటర్లు ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్ మరియు ఎస్ 1 ఎయిర్ లను కూడా విక్రయిస్తుంది. ఈవీ తయారీ సంస్థ భారతీయ వినియోగదారులకు ఆచరణీయమైన మోడళ్లపై దృష్టి పెట్టాలని భావిస్తోంది.
భవిష్యత్తులో తీసుకువస్తారా?
కారు ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేశారా లేదా భవిష్యత్తులో దీనిని పునరుద్ధరిస్తారా అనే దానిపై భవిష్ అగర్వాల్ స్పష్టత ఇవ్వలేదు. తాము రూపొందించాలనుకున్న ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశానికి వర్తించదని సూచిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు 'ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ధరలో భారత్ లో కార్లను విడుదల చేయాలనే తన లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.