Maruti Suzuki price cut : ఈ చిన్న కార్ల ధరలను తగ్గించిన మారుతీ సుజుకీ.. సేల్స్ పతనమే కారణమా?
02 September 2024, 11:17 IST
మారుతీ సుజుకీ సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోని రెండు చిన్న కార్ల ధరలను తగ్గించింది. ఆగస్ట్‌లో సంస్థ సేల్స్ పతనమైన వెంటనే ఈ ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు..
మారుతీ సుజుకీ చిన్న కార్ల ధరల తగ్గింపు..
మారుతీ సుజుకీ రెండు మోడళ్ల ఎంపిక చేసిన వేరియంట్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కట్ చేసిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ.5.01 లక్షలు (ఎక్స్-షోరూమ్) రూ.2,000 తగ్గింది. ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోల్ ధర రూ.6,500 తగ్గింది.
మారుతీ సుజుకీ 2024 ఆగస్టులో మొత్తం వాహన అమ్మకాలలో 3.9 శాతం క్షీణతను నివేదించిన మరుసటి రోజే ధరల తగ్గింపు వార్త బయటకు రావడం గమనార్హం.
మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. వీటిలో అమ్మకాలు 2023 ఆగస్టులో 84,660 యూనిట్ల నుంచి 68,699 యూనిట్లకు పడిపోయాయి.
బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20 శాతం క్షీణించి 58,051 యూనిట్లకు పరిమితమయ్యాయి. గ్రాండ్ విటారా, బ్రెజా, ఎర్టిగా, ఇన్విక్టో, ఫ్రాంక్స్, ఎక్స్ఎల్6తో కూడిన యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ మాత్రం గత నెలలో 58,746 యూనిట్ల నుంచి 62,684 యూనిట్లకు పెరిగింది.
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ, ఆగస్టులో కంపెనీ వాహనాల పంపిణీని 13,000 యూనిట్లు తగ్గించిందని వివరించారు
“మా భాగస్వాముల వద్ద స్టాక్ సరైన విధంగా ఉండేందుకు మేము ప్రయత్నిస్తున్నాను. స్టాక్ లేమి కారణంతో సేల్స్ ఆగకూడదని చూస్తున్నాము,” అని ఆయన అన్నారు.
సేల్స్ పతనం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్లో మారుతీ సుజుకీ షేర్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:- Cars Launch In September : త్వరలో షోరూమ్‌లలో సందడి చేసే కార్లు ఇవే.. ఇందులో 420 కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కూడా
టాటా మోటార్స్ కూడా..!
ఆగస్ట్ నెలలో మారుతీ సుజుకీ మాత్రమే కాదు.. టాటా మోటార్స్ వాహనాల సేల్స్ కూడా పడిపోయాయి. 2024 ఆగస్టులో 70,006 యూనిట్ల అమ్మకాలను చూసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 76,261 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. కంపెనీ డేటా ప్రకారం.. 2024 ఆగస్టులో కంపెనీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 15 శాతం క్షీణించి 27,207 యూనిట్లకు చేరుకున్నాయి. 2024 ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం క్షీణించి 44,142 యూనిట్లకు పరిమితమయ్యాయి.
వాస్తవానికి సేల్స్‌లో తగ్గుదల ఉంటుందని గత త్రైమాసికంలోనే టాటా మోటార్స్ సంస్థ ఓ ప్రకటన ద్వారా మార్కెట్‌కి తెలియజేసింది.
ఆగస్ట్ సేల్స్ పడిపోయిన నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో 1.5శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.