Honda: ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో హోండా రికార్డ్; సేల్స్ లో ‘హీరో’ ను వెనక్కు నెట్టి టాప్ లోకి..
భారతీయ టూ వీలర్ మార్కెట్లో హోండా రికార్డు సృష్టించింది. 2024 ఏప్రిల్-జూలై కాలంలో దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఇప్పటివరకు టాప్ లో ఉన్న హీరో మోటో కార్ప్ ను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలోకి చేరుకుంది.
2024 ఏప్రిల్-జూలై కాలంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. హీరో మోటోకార్ప్ దేశీయ అమ్మకాల పట్టికలో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తొలి స్థానానికి చేరుకుంది.
హోండా టాప్, హీరో సెకండ్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూలై కాలంలో హీరో మోటోకార్ప్ హోల్సేల్ డిస్పాచ్ నంబర్లను హోండా అధిగమించింది. భారతీయ టూ వీలర్ మార్కెట్ ను గతంలో 26 ఏళ్ల పాటు ఈ రెండు సంస్థలే ‘హీరో హోండా’గా ఏలాయి. ఆ తరువాత, 13 ఏళ్ల క్రితం విడిపోయి, స్వతంత్ర సంస్థలుగా మారాయి. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత హీరో మోటోకార్ప్ దేశీయ అమ్మకాలను హోండా అధిగమించింది.
సేల్స్ గణాంకాలు..
2024 ఏప్రిల్-జూలై కాలంలో హోండా దేశీయంగా 18,53,350 యూనిట్ల ద్విచక్ర వాహనాలను డిస్పాచ్ చేయగా, హీరో మోటోకార్ప్ 18,31,697 యూనిట్లను డిస్పాచ్ చేసిందని సియామ్ తన చార్ట్ లో పేర్కొంది. అంటే హోండా తన సమీప ప్రత్యర్థి కంటే 21,653 యూనిట్లు ఎక్కువ ద్విచక్ర వాహనాలను అమ్మగలిగింది ఎగుమతి చేసిన వాహనాల సంఖ్యలను లెక్కించినప్పుడు ఈ వ్యత్యాసం 1.30 లక్షల యూనిట్లకు పైగా పెరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2023 లో, హోండా (HONDA) 12,63,062 యూనిట్లను విక్రయించగా, హీరో మోటోకార్ప్ 16,88,454 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
మార్కెట్ వాటా కూడా పెరిగింది..
గత రెండు నెలలుగా భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా మార్కెట్ వాటా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం 20 శాతంగా ఉన్న హెచ్ఎంఎస్ఐ మార్కెట్ వాటా 2024 జూలైలో 24.3 శాతానికి పెరిగింది. దీనికి భిన్నంగా హీరో మోటోకార్ప్ మార్కెట్ వాటా 2024 ఏప్రిల్లో 33 శాతానికి పైగా ఉండగా, ఈ ఏడాది జూలైలో 29.4 శాతానికి పడిపోయింది.