Cars Launch In September : త్వరలో షోరూమ్‌లలో సందడి చేసే కార్లు ఇవే.. ఇందులో 420 కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కూడా
Cars Launch In September : సెప్టెంబరులో ప్రముఖ కంపెనీల కార్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొన్ని కార్ల గురించిన వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. మరికొన్నింటి గురించి బయటకు రావాల్సి ఉంది. ఈ నెలలో విడుదలకు అవకాశం ఉన్న కార్లు జాబితా చూద్దాం..
భారతదేశంలో ప్రముఖ ఆటో కంపెనీల కార్లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. డిసెంబర్ నెలలో చాలా కంపెనీల కార్లు లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దగ్గరలో పండుగలు ఉండటంతో కస్టమర్లు కూడా కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీలు భారీ ఆఫర్లు, ప్రయోజనాలను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీదారులు భారతదేశంలో కొత్త కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
కనీసం ఐదారు కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లతో మార్కెట్లోకి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. SUVలు, ఎలక్ట్రిక్ కార్లు, సెడాన్‌లు సెప్టెంబర్‌లో షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ కార్లు జాబితా ఇదిగో..
టాటా కర్వ్
టాటా కర్వ్ కూపే SUV ఎలక్ట్రిక్ వెర్షన్ తర్వాత, టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో ICE మోడల్‌ను విడుదల చేస్తుంది. కర్వ్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్‌లతో సెప్టెంబర్ రెండో తేదీన ప్రారంభిస్తున్నారు. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ TGDi టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లుతో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో టాటా కర్వ్‌పై ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCA గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. ఈ కూపే SUV భారత మార్కెట్లో డీజిల్ DCT కలయికను కలిగి ఉన్న మొదటి కారు కావడం కూడా గమనార్హం. ఇది మిడ్-సైజ్ SUVలతో పోటీపడుతుంది. ఈ కర్వ్ దాదాపు రూ.11 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ
కర్వ్ తర్వాత.. టాటా మోటార్స్ సెప్టెంబర్ చివరి నాటికి కొత్త నెక్సాన్ సీఎన్‌జీని విడుదల చేస్తుంది. దేశంలోనే టర్బో పెట్రోల్ ఇంజన్‌ని పొందిన మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనం ఇదే కావడం గమనార్హం. టాటా నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం భారతదేశంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్న మొదటి SUV కూడా అవుతుంది.
హ్యుందాయ్ అల్కాజర్
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమేకర్ 7-సీటర్ ఎస్‌యూవీ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్లోకి రాబోతోంది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ డిజైన్‌లు ఇప్పటికే బయటకు వచ్చాయి. మోడల్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేస్తారు. ఈ SUV కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్నవారు రూ. 25,000 చెల్లించి వాహనాన్ని ఇప్పుడే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బయట డిజైన్ మార్పులు క్రెటా N-లైన్ మాదిరిగానే ఉంటాయి. లోపలి భాగంలో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ రెండు పెద్ద స్క్రీన్‌లు, ADAS సూట్, మరిన్ని కొత్త ఫీచర్లను కూడా పొందుతుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCT, ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌లతో వస్తుంది.
MG విండ్‌స్టర్ ఈవీ
భారతదేశంలో MG మూడో ఎలక్ట్రిక్ కారుగా విండ్‌స్టర్ EV సెప్టెంబర్ 11న విడుదల కానుంది. CUVగా పిలిచే ఈ కారు LED లైట్ బార్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్‌ప్లేన్ లాంటి వెనుక సీట్ల వంటి అద్భుతమైన ఫీచర్‌లతో వస్తుంది. క్లౌడ్ EV ప్రపంచవ్యాప్తంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. MG మోటార్ వీటిలో ఏది ఇండియా-స్పెక్ కారులోకి ప్రవేశపెడుతుందనే సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే విండ్‌స్టర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 420 కి.మీ వరకు ప్రయాణించగలదని చెబుతున్నారు. ఇది భారతదేశంలోని టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 EV వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
మారుతి డిజైర్
అప్డేట్ చేసిన డిజైర్ కూడా సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానుందని సమాచారం. కాంపాక్ట్ సెడాన్ కొత్త స్విఫ్ట్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజైన్ ఎలిమెంట్స్‌తో కూడా వస్తుంది. 1.2-లీటర్, Z12E పెట్రోల్ ఇంజన్‌గా ఉంటుంది.