Gold Loan Bank Interest : గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే.. చెక్ చేసుకుని వెళ్లండి
21 August 2024, 8:54 IST
- Gold Loan Bank Interests : బంగారం మీద లోన్ తీసుకోవడం అనేది చాలా మందికి అలవాటు. అత్యవసర పరిస్థితుల్లో అవే మనల్ని కాపాడుతాయి. గోల్డ్ లోన్ తీసుకోవడం వరకూ ఒకే.. కానీ వాటిపై బ్యాంకు వడ్డీ రేట్లను కూడా తెలుసుకోవాలి. గోల్డ్ లోన్‌కు ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు నిర్ణయించాయో చూద్దాం..
గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు
అప్పు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ డబ్బు అవసరమైనప్పుడు చేసే పని. అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ సులభంగా డబ్బు పొందడానికి మార్గాలు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మాత్రమే మీరు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ పొందవచ్చు. అయితే గోల్డ్ లోన్ తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు.
ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్‌కు ఆదరణ పెరిగింది. మీరు రుణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, మీరు త్వరగా డబ్బును పొందుతారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ లోన్స్ ఉపయోగపడతాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారు రుణాలకు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అందువల్ల తక్కువ వడ్డీ రేటును ఇచ్చే బ్యాంకును ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి..
గోల్డ్ లోన్ కోసం వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
కోటక్ మహీంద్రా బ్యాంక్ – 8 శాతం నుండి 24 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.45 శాతం నుండి 8.55 శాతం
UCO బ్యాంక్ – 8.50 శాతం
ఇండియన్ బ్యాంక్ - 8.65 శాతం నుండి 9 శాతం
యూనియన్ బ్యాంక్ - 8.65 శాతం నుండి 9.90 శాతం
ఎస్బీఐ - 8.70 శాతం
ఇండస్‌ఇంద్ బ్యాంక్ - 8.75 శాతం నుండి 16.00 శాతం
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ - 8.85 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 9.25 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 9.30 శాతం
ఫెడరల్ బ్యాంక్ - 9.49 శాతం
ICICI బ్యాంక్ - 10.00 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్ - 10.01 శాతం
యాక్సిస్ బ్యాంక్ - 17 శాతం
HDFC బ్యాంక్ - 8.30 శాతం నుండి 16.55 శాతం
ప్రాసెసింగ్ ఫీజ్
గోల్డ్ లోన్ సమయంలో బ్యాంకులు ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తాయి. దీంతో రుణం తీసుకునే ముందు, మీరు ప్రాసెసింగ్ ఫీజు గురించి కూడా తెలుసుకోవాలి. ఇతర రకాల రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్‌లు అధిక రుణ మొత్తాన్ని అందిస్తాయి. తాకట్టు పెట్టిన బంగారం మార్కెట్ విలువ ఆధారంగా రుణ మొత్తం నిర్ణయిస్తారు. బంగారం విలువలో 80 శాతం వరకు పొందవచ్చు
ఈజీగానే లోన్
గోల్డ్ లోన్ కోసం అప్లై చేసేటపుడు మీరు బంగారు నాణేలు, ఆభరణాలు మొదలైనవాటిని కలిగి ఉండటమే అవసరం. మీకు బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ మీరు లోన్ పొందవచ్చు. గోల్డ్ లోన్ పొందడం కోసం డాక్యుమెంటేషన్ ప్రక్రియ వ్యక్తిగత రుణం లాగా కఠినంగా ఉండదు. కేవలం కైవైసీ పత్రాలను సమర్పించండి.
ఎంక్వైరీ చేసి వెళ్లండి
విశ్వసనీయ సంస్థల వద్ద మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి. కానీ ఎన్‌బీఎఫ్‌సీలతో సహా ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థల నుండి ఎక్కువ మొత్తంలో రుణం పొందడం సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. తిరిగి చెల్లించే నిబంధనలు, నెలవారీ వడ్డీ రేట్ల శాతం మొదలైనవాటిని పోల్చి, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే రుణం ఎక్కడ నుండి పొందాలో డిసైడ్ చేసుకోవాలి.