Gold loans without gold: Gold loans: బంగారం తాకట్టు పెట్టకుండానే గోల్డ్ లోన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వింత మోసం
Gold loans without gold: సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని, గోల్డ్ లోన్ ఇస్తుంటారు. అది కూడా, మొత్తం బంగారం విలువకు సమానమైన డబ్బు కూడా ఇవ్వరు. కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు బంగారం తాకట్టు పెట్టుకోకుండానే, కస్టమర్లకు గోల్డ్ లోన్స్ ఇచ్చేశారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన పలు శాఖల్లో ఈ వింత మోసం చోటు చేసుకుంది. ఇందులో బ్యాంక్ కు ఇప్పటివరకు ఎలాంటి నగదు నష్టం జరగలేదు. కానీ, నిబంధనలకు అనుగుణంగా గోల్డ్ లోన్స్ ఇవ్వకపోవడంతో, సంబంధిత బ్రాంచ్ ఉద్యోగులకు బ్యాంక్ చర్యలు తీసుకుంది.
టార్గెట్ రీచ్ కావడం కోసం..
గోల్డ్ లోన్స్ కు సంబంధించి బ్యాంక్ విధించిన టార్గెట్ లను రీచ్ కావడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ఈ వింత మోసానికి తెర తీశారు. ఇందులో వారు ముందుగా, తమకు నమ్మకమైన కస్టమర్లను ఎంచుకుంటారు. వారి వద్ద నుంచి బంగారం తాకట్టు పెట్టుకోకుండానే, వారికి బంగారంపై రుణం ఇస్తారు. వారి బ్యాంక్ ఖాతాకు ఈ గోల్డ్ లోన్ (gold loan) మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేస్తారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ కస్టమర్లు కొంత కాలం తరువాత ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంక్ కు చెల్లిస్తారు. ఇందులో కస్టమర్ నుంచి బ్యాంక్ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయదు. అలాగే, ఆ డబ్బును కస్టమర్ వాడుకోకుండా, బ్యాంక్ ఖాతాలోనే ఉండేలా, జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా గోల్డ్ లోన్ షాప్స్ లేదా గోల్డ్ లోన్ కస్టమర్లకు సేవలందించే ప్రైవేట్ ఎన్ క్లోజర్లు ఉన్న బ్రాంచ్ లలో ఈ ఉల్లంఘనలు జరిగాయి. బీవోబీ లో ఇలాంటి ఎన్ క్లోజర్లు 1,238 ఉన్నాయని తేలింది.
నిబంధనల ఉల్లంఘన
అయితే, బంగారం తాకట్టు పెట్టుకోకుండా, బంగారంపై రుణాలు ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడమేనని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇది రెగ్యులేటరీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలిపాయి. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోని కొందరు బీవోబీ సిబ్బంది, టార్గెట్స్ రీచ్ కావడం కోసం స్నేహపూర్వక కస్టమర్లతో కలిసి ఈ ప్లాన్ ను అమలు చేశారు. ఈ విధానంలో, కస్టమర్ డబ్బును ఉపయోగించకుండా చూసుకోవడానికి అతడి ఖాతాలో లోన్ డబ్బుకు సమానమైన మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. ఈ గోల్డ్ లోన్స్ కు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును బ్రాంచ్ తన సొంత ఖర్చుల ఖాతా నుండి చెల్లిస్తుంది.
9.4 శాతం వడ్డీ
బీవోబీ ప్రస్తుతం రిటైల్ గోల్డ్ లోన్స్ పై 9.4 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బంగారు ఆభరణాలపై రూ.50 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఇటీవల ఈ అవకతవకలపై బీఓబీకి సమాచారం వచ్చినట్లు తెలిసింది. గత సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్ నెలల మధ్య కొన్ని బంగారు రుణాలకు సంబంధించి అవకతవకలను బ్యాంక్ ఆడిట్ విభాగం గుర్తించింది. కొన్ని గోల్డ్ లోన్ ఖాతాలను మూడు నెలలలోపే మూసివేయడం గుర్తించారు. 4,679 రుణ ఖాతాలు మూడు రోజుల్లో మూతపడగా, 238 ఖాతాలను ఒకే రోజు తెరిచి, అదేరోజు మూసివేశారు.