BoB Q1FY24 results: 87 శాతం పెరిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాలు
BoB Q1FY24 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) శనివారం విడుదల చేసింది. ఈ క్యూ 1 లో బీఓబీ రూ. 4,070 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
BoB Q1FY24 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘‘బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)’’ శనివారం విడుదల చేసింది. ఈ క్యూ 1 లో బీఓబీ రూ. 4,070 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం క్యూ 1 (Q1FY23) తో పోలిస్తే ఇవి 87.72% అధికం. Q1FY23 లో బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభాలు రూ. 2,168.1 గా ఉన్నాయి. గత క్యూ 1 కన్నా దాదాపు 87% అధిక లాభాలను ఆర్జించినప్పటికీ, బీఓబీ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం విశేషం. ఈ క్యూ 1లో బీఓబీ కనీసం రూ. 4,630 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.
ఆదాయం 30 వేల కోట్లు
ఈ క్యూ 1 (Q1FY24)లో బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం ఆదాయం రూ. 29,878.07 కోట్లుగా ఉంది. Q1FY23 లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,119.52 కోట్లు. అంటే Q1FY23 లో కన్నా, Q1FY24 లో బ్యాంక్ మొత్తం ఆదాయం 48.50% పెరిగింది. కాగా, గత క్వార్టర్ (Q4FY23) తో పోలిస్తే, ఈ క్వార్టర్ (Q1FY24) లో బ్యాంక్ ఆదాయం స్వల్పంగా పెరిగింది. Q4FY23 లో బ్యాంక్ రూ. 29,322.74 కోట్ల ఆదాయం సముపార్జించగా, Q1FY24 లో బ్యాంక్ రూ. 29,878.07 కోట్ల ఆదాయం సాధించింది.
ఎన్పీఏలు తగ్గాయి..
ఈ క్యూ 1 లో బ్యాంక్ నిరర్ధక ఆస్తుల విలువ గణనీయంగా తగ్గింది. Q1FY23 లో రూ. 12,652.74 కోట్లు గా ఉన్న బ్యాంక్ నికర నిరర్ధక ఆస్తుల విలువ Q1FY24 నాటికి రూ. 7,482.45 కోట్లకు తగ్గాయి. అంటే సంవత్సర కాలంలో దాదాపు 40% నిరర్ధక ఆస్తులు తగ్గాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ విలువ బీఎస్ఈ లో శుక్రవారం రూ. 190.05 వద్ద ముగిసింది. గత వారం బీఓబీ షేర్ విలువ దాదాపు 6% తగ్గింది.