Electric scooter : ఇండియాలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే! సింగిల్ ఛార్జ్‌తో 300 కి.మీలు..
10 December 2024, 6:40 IST
- Highest range electric scooter : ఛార్జింగ్ కష్టాల నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని ఎంపిక చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే మీరు కొమాకి వెనిస్ అల్ట్రా స్పోర్ట్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఇండియాలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
భారత దేశంలో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు షిఫ్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు వివిధ ఆటోమొబైల్ సంస్థ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అయితే, ఛార్జింగ్ సమస్యల నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు లాంగ్ రేంజ్ ఈవీలను ఎంపిక చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? సింగిల్ ఛార్జ్‌తో సుదీర్ఘ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలోనే హయ్యెస్ట్ రేంజ్‌ని ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఒకటి కొమాకి వెనిస్ అల్ట్రా స్పోర్ట్. ఈ వెహికిల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే, ఇక ఆగేది విజయవాడ అవతలే! దీని రేంజ్ 300 కి.మీలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హయ్యెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే..
ఈ కొమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి వెనిస్ స్పోర్ట్ క్లాసిక్, వెనిస్ స్పోర్ట్, వెనిస్ అల్ట్రా స్పోర్ట్. వీటిని ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్స్గా సంస్థ ప్రమోట్ చేస్తోంది. ఇక టాప్ ఎండ్ ఈవీ వెనిస్ అల్ట్రా స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో రిమూవెబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీని 0-100శాతం ఛార్జ్ చేసేందుకు 4 గంటల 55 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. పోర్టెబుల్ ఛార్జ్‌తో 0-90శాతం ఛార్జింగ్ 4 గంటల్లో పూర్తవుతుందని స్పష్టం చేసింది.
వెనిస్ అల్ట్రా స్పోర్ట్‌లో అల్ట్రా బ్రైట్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, 3000 వాట్ హబ్ మోటార్, 50ఏఎంపీ కంట్రోలర్, కంఫర్ట్ కోసం డ్యూయెల్ సీట్, డ్యూయెల్ సైడ్ ఫుట్‌రెస్ట్, సేఫ్ రైడ్ కోసం హై డ్యూరెబుల్- సూపర్ స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్, సీబీఎస్ డబుల్ డిస్క్, కీలెస్ ఎంట్రీ- కంట్రోల్, టీఎఫ్టీ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నేవిగేషన్, సౌండ్ సిస్టెమ్, కాలింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 గేర్ మోడ్స్ ఉంటాయి. అవి ఈకో, స్పోర్ట్, టర్బో. ఇక ఈ వెనిస్ అల్ట్రా స్పోర్ట్ రేంజ్ 300 కి.మీలు. టాప్ స్పీడ్ 80 కేఎంపీహెచ్. బ్యటరీపై 3ఏళ్లు లేదా 30,000 వేల కి.మీల వారెంటీని సైతం సంస్థ అందిస్తోంది.
"మెరుగైన భవిష్యత్తుపై మేము దృష్టి సారిస్తాము. మా లిమిట్స్‌ని నిరంతరం పుష్ చేసుకునేందుకు మేము కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉన్నాము. మా వెనిస్ రేంజ్ స్కూటర్లు ఈకో- ఫ్రెండ్లీ టెక్నాలజీలో విప్లవాత్మకంగా ఉంటాయని భావిస్తున్నాము. ఈ స్కూటర్లలో ఐకానిక్ లుక్స్, బెటర్ డ్రైవ్ ఎబిలిటీ, పవర్, మంచి పర్ఫార్మెన్స్ వంటివి ఉంటాయి," అని కొమాకి సంస్థ చెబుతోంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్షిప్షోరూమ్స్- సర్వీస్ పార్టర్నర్స్ ఉన్నారు.
ఈ కొమాకి వెనిస్ అల్ట్రా స్పోర్ట్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,67,500. అంతేకాకుండా, కస్టమర్స్‌కి సాక్రోమెంటల్ గ్రీన్‌తో పాటు ఎన్నో కలర్ ఆప్షన్స్‌ని సైతం సంస్థ అందిస్తోంది.