Upcoming SUV Cars : భారతీయ మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు.. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు!
Upcoming Cars : కొత్త కార్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. కొత్త ఏడాదిలో కంపెనీలు తమ కార్లను లాంచ్ చేసేందుకు చూస్తున్నాయి. ఇందులో మూడు ఎస్‌యూవీలు ఉన్నాయి.
భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో ప్రతినెలా కార్లు లాంచ్ అవుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది కూడా కొత్త కార్లు మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 సంవత్సరం దగ్గరకు వస్తున్న సమయంలో అనేక కంపెనీలు మార్కెట్‌లోకి కొత్త కార్లను తీసుకొస్తున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో కొత్త కార్లు భారతీయ రోడ్లపై తిరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాయి. రాబోయే 2 నెలల్లో మార్కెట్లోకి రానున్న కార్ల జాబితా చూద్దాం.. ఇప్పటికే ఇవి టెస్టింగ్ సమయంలో కనిపించాయి.
మారుతీ సుజుకి ఈ విటారా
దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు మారుతీ సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు రానుంది. సుజుకి త్వరలో ఈ విటారాని ప్రారంభించబోతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు. మారుతీ సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుందని అనుకుంటున్నారు. పెద్ద బ్యాటరీ ప్యాక్ అంచనా 500 ప్లస్ కి.మీ రేంజ్ ఉండనుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
క్రెటా ఈవీ అనేక సార్లు టెస్టింగ్ చేశారు. ఇప్పటికే ఉన్న ఐసీ ఇంజిన్ క్రెటా నుండి డిజైన్ తీసుకోనుంది. దీనికి అనేక మెరుగులు దిద్దనున్నారు. దీని మొత్తం డిజైన్ హ్యుందాయ్ క్రెటా మాదిరిగానే ఉండబోతోంది. రాబోయే క్రెటా ఈవీలో కోనా ఈవీ మాదిరిగానే బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. ఇది 45 kWh బ్యాటరీ ప్యాక్‌గా ఉండబోతోంది. ఒక్కసారి ఛార్జింగ్‌పై దాదాపు 500 కి.మీల రేంజ్ ఇవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
కియా సిరోస్
కియా ఇండియా తన సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఇది కాకుండా అనేకసార్లు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ మోడల్.. కియా సెల్టోస్ కంటే కొంచెం పొడవుగా ఉండే అవకాశం ఉంది. అయితే పన్ను తగ్గింపు కోసం దీనిని 4 మీటర్ల కంటే తక్కువగా ఉంచాలని భావిస్తున్నారు. డిజైన్ చూస్తే.. ఇది ప్రముఖ వీల్ క్లాడింగ్, రూఫ్ రైల్స్‌తో కూడిన బాక్సీ ఆకారపు ఎస్‌యూవీ. 4 స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్‌తో వస్తుంది. దీనికి స్ప్లిట్ టెయిల్లాంప్ డిజైన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉండనున్నాయి.