9NUTZ MILLETS : ఆరోగ్యంతో పాటు ఉపాధి- ‘మిల్లెట్స్’ ఆలోచనతో కోట్లల్లో వ్యాపారం చేస్తున్న కీర్తన..
14 September 2024, 12:10 IST
- 9NUTZ MILLETS అనే సంస్థ రుచికరమైన, ఆరోగ్యవంతమైన మిల్లెట్ ప్రాడక్ట్స్‌ని తయారు చేస్తోంది. ఈ కంపెనీని స్థాపించిన వంగపల్లి కీర్తనకు వచ్చిన ఒక్క ఆలోచన.. ఇప్పుడు అనేక మందికి ఉపాధినిస్తోంది. ఆమె సంస్థ కోట్లల్లో వ్యాపారం చేస్తోంది.
మహిళా వర్కర్లతో వంగపల్లి కీర్తన..
"ఆరోగ్యమే మాహా భాగ్యం" అని అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా చేయగలము. కొవిడ్ సంక్షోభం తర్వాత నేటి తరానికి ఈ విషయం ఇంకా బాగా తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు హెల్తీ లైఫ్‌స్టైల్‌పై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? హెల్తీ ఈటింగ్‌తో హెల్తీ లైఫ్‌స్టైల్‌ని కొనసాగించాలని చూస్తున్నారా? అయితే 9NUTZ MILLETS గురించి, ఆ కంపెనీని స్థాపించిన వంగపల్లి కీర్తన గురించి తెలుసుకోవాలి. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఫుడ్ ఆప్షన్స్ అందివ్వాలని ఆమెకు వచ్చిన ఒక్క ఆలోచన.. ఇప్పుడు చాలా మందికి ఉపాదిని సైతం కల్పిస్తోంది. సెప్టెంబర్ నెలను ‘నేషనల్ న్యూట్రీషియన్ మంత్’ (జాతీయ పోషకాహర మాసం)గా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆరోగ్య భారత్ కోసం కృషి చేస్తున్న వంగపల్లి కీర్తన కథను ఇక్కడ తెలుసుకోండి..
కొవిడ్ సంక్షోభంతో పుట్టుకొచ్చిన ఆలోచన..
కొవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌కు చెందిన వంగపల్లి కీర్తనని కూడా ఈ మహమ్మారి చాలా బాధపెట్టింది. కొవిడ్ సోకడంతో ఆమె కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కీర్తనకు ఆమె కుటుంబం.. మిల్లెట్‌లతో చేసిన ఆహారాన్ని అందించింది. మిల్లెట్‌లతో చేసిన అన్ని సాంప్రదాయ వంటకాలను పెట్టింది. ఎలాంటి మందులు అవసరం లేకుండానే కీర్తన వేగంగా కోలుకోవడానికి మిల్లెట్ ఆహారాలు సహాయపడ్డాయి.
కొవిడ్ కారణంగా చాలా మంది ఆరోగ్యంపై ఫోకస్ చేశారు. ఆహారపు అలవాట్లపై దృష్టి సారించరు. అప్పుడే కీర్తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆరోగ్యకరమైన, సహజమైన ఆహారాన్ని తీసుకుంటే మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు కదా! అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఫలితంగా, ఎటువంటి చక్కెర లేదా నిల్వ కారకాలను వినియోగించకుండా మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రాడక్ట్స్‌ని తయారు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
ఒక మహిళగా కుటుంబ మద్దతు చాలా ముఖ్యం. కుటుంబ మద్దతు వ్యాపార ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. మరిన్ని ప్రయత్నాలు చేయడానికి, ధైర్యం చేయడానికి ప్రోత్సహాన్ని ఇస్తుంది. ఈ విషయంలో తాను చాలా అదృష్టంతురాలిని అని కీర్తన చెబుతుంటరు. ఆమె ఆలోచనకు కుటుంబసభ్యులు పూర్తి మద్దతు ఇచ్చి, అండగా నిలబడ్డారు.
ప్రారంభంలో, మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని తయారు చేయడం, ఖర్చు లేకుండా ప్రజలకు పంపిణీ చేయడాన్ని కీర్తన ప్రారంభించారు. డిమాండ్ పెరిగినప్పుడు, దాన్ని వ్యాపారంగా మార్చాలని భావించారు. అయితే ఈ క్రమంలో ఆమెకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిల్లో ముఖ్యమైనది... ఆర్థిక సవాలు! రుణం పొందడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలితాల్ని ఇవ్వలేదు. అలా అని ఆమె నిరుత్సాహపడలేదు. అప్పుడే ఆమెకి బీవైఎస్టీ (భారతీయ యువ శక్తి ట్రస్ట్) గురించి తెలిసింది. బీవైఎస్టీ మద్దతు, కీర్తన బ్యాంకు నుంచి రుణం పొందగలిగారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణం మంజూరు చేసి, వారు ఆమెకు మద్దతు ఇచ్చారు. మార్కెటింగ్‌లో, లింకేజీలను అందించడంలో, ప్యాకేజింగ్‌లో బీవైఎస్టీ మార్గదర్శకత్వం ఆమెకు సహాయపడింది. హైటెక్ ఎక్స్‌పోలో మూడు రోజుల పాటు ఉచితంగా స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం అందించారు. ప్రభుత్వ అధికారి నుంచి పెద్ద ఆర్డర్‌ను పొందేందుకు ఇది కీర్తనకు సహాయపడింది. ఫలితంగా ఆమె వ్యాపారం మరో మూడు జిల్లాలకు విస్తరించింది.
"ఇప్పుడు నా కంపెనీలో 25 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 23 మంది మహిళలు. ఈ మహిళలు కంపెనీలో చేరడానికి ముందు గృహిణులు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాను. ఆరోగ్యకరమైన ఎంపికలను అందించడంలో, ముఖ్యంగా మహిళలకు జీవనోపాధిని కల్పించడంలో నేను నా వంతు సహకారం అందించాలనుకుంటున్నాను," అని కీర్తన చెప్పుకొచ్చారు.
కీర్తనకు చెందిన సంస్థ.. ఎలాంటి చక్కెర, శుద్ధి చేసిన పిండి, బియ్యం లేదా గోధుమలను ఉపయోగించకుండా మిల్లెట్ స్వీట్లు, మిల్లెట్ బిస్కెట్లు, మిల్లెట్ చాక్లెట్లు, మిల్లెట్ నమ్‌కీన్స్, మిల్లెట్ చిక్కీలు, మిల్లెట్ న్యూట్రి బార్‌లు వంటి మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
"మొదటి సంవత్సరంలో మేము మిల్లెట్ స్వీట్లు, మిల్లెట్ బిస్కెట్లు, మిల్లెట్ నమ్‌కీన్‌లను విడుదల చేశాము. రెండవ సంవత్సరంలో మేము మిల్లెట్ చాక్లెట్, మిల్లెట్ చిక్కిస్, మిల్లెట్ న్యూట్రిబార్‌లను ప్రారంభించాము. ప్రస్తుతం, మేము ఈ అన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్నాము. త్వరలో ఇన్స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రీమిక్స్‌లను ప్రారంభించాలని భావిస్తున్నాము," అని కీర్త చెప్పుకొచ్చారు.
"మా టార్గెట్ కస్టమర్‌లు , పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు. మన దేశానికి నాయకత్వం వహించే మన యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం నేను సహకరించాలనుకుంటున్నాను. వారు మన సాంప్రదాయ, ఆరోగ్యకరమైన ఆహారాలను తింటారు. ప్రయోజనం పొందుతారు," అని కీర్తన అభిప్రాయపడ్డారు.
కీర్తన స్థాపించిన 9NUTZ MILLETS PVT LTD సంస్థ.. 2022లో రూ. 1.5కోట్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. రానున్న సంవత్సరాల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆమె భావిస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం 9NUTZ MILLETS PVT LTD ఈమెయిల్ info.9nutz@gmail.com ని సంప్రదించవచ్చు.