TGSPDCL : 'మా విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి' - TGSPDCL ప్రత్యేక ఫోన్ నెంబర్లు-tgspdcl cmd musharraf ali faruqui call to consumers to lodge complaint against power staff demanding bribes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgspdcl : 'మా విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి' - Tgspdcl ప్రత్యేక ఫోన్ నెంబర్లు

TGSPDCL : 'మా విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి' - TGSPDCL ప్రత్యేక ఫోన్ నెంబర్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 07:42 PM IST

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ కీలక ప్రకటన చేశారు. తమ సంస్థ పరిధిలోని అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక నెంబర్ల(040 - 2345 4884 లేదా 7680901912)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు.

అవినీతి ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు
అవినీతి ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలో పని చేసే అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి ఓ ప్రకటన విడుదల చేశారు.

సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఏవరైనా లంచం అడిగితే 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ మేరకు సీఎండీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి - సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి

“మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి. సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాం” అని సీఎండీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

మరోవైపు ఇటీవలే విద్యుత్ వినియోగదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీజీఎస్పీడీసీఎల్. మళ్లీ యూపీఐ పేమెంట్స్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్‌ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. కరెంట్ బిల్లుల చెల్లింపులను వేగంగా చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(బీబీపీఎస్‌)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో యూపీఐ సేవలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు విద్యుత్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

టీజీఎస్పీడీసీఎల్‌ ఇప్పటికే ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. కొద్దిరోజుల కిందటే గూగుల్ పే ద్వారా చెల్లించే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం యూపీఐ మాత్రమే కాకుండా…. వినియోగదారులు TGSPDCL అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా బిల్లు కట్టుకోవచ్చు. హోం పేజీలోనే బిల్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వివరాలను నమోదు చేసి సింపుల్ గా కరెంట్ బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్ మాత్రమే కాదు… యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోని ఈ ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు.

టాపిక్