AC Santhi Issue: అవినీతికి ఆరోపణలతోనే ఏసీ శాంతి సస్పెన్షన్, విచారణ తర్వాత చర్యలు తప్పవన్న మంత్రి ఆనం
AC Santhi Issue: ఏపీలో సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంపై మంత్రి ఆనం స్పందించారు. అవినీతి ఆరోపణపై ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు.
AC Santhi Issue: దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసిన తర్వాతే ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమెపై తీవ్రమైన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ రెడ్డి, ఏసీ శాంతిల పాత్ర ఉందని ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా లీజులు కేటాయించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతోనే ఆమెపై చర్యలు తీసుకున్నట్టు ఆనం స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి సస్పెండ్ చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ సస్పెన్షన్ జరిగేది కాదేమోనని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో పలు సంబంధాలు ఉన్నాయని.. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు ఆనం ఆరోపించారు.
2020లో ఉద్యోగంలో చేరిన శాంతి, విజయవాడలో విల్లా కొనుక్కోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు అనుమతి కోసం దరఖాస్తు చేసిందని అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదని ఆ తర్వాత అపార్ట్మెంట్ కొనుగోలుకు దరఖాస్తు చేయడంతో ఆయన అనుమతించారని తెలిపారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ ..శాంతి పాత్ర ఉందని తమకు సమాచారం అందిందన్నారు.
గత ఐదేళ్లలో జరిగిన కేటాయింపులు, లీజులపై విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ భూములను 99 సంవత్సరాల లీజుకు ఇచ్చారని.. పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుమతితో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాజధాని లేకుండా చేశారు…
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. సచివాలయం అనే దాని గురించి అప్పటి సీఎం జగన్ మరచిపోయారని, స్వయంగా ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోతే మంత్రులు ఎలా వస్తారని మండిపడ్డారు.
జగన్ తన అనుచరులకు వేల ఎకరాలు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి చూశామన్నారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడి బెదిరించారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా చేశారని ఆరోపించారు. దీంతోపాటు గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టం మిగిల్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్లపాటు సాగిన విధ్వంస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ దోపిడీపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.