Jio free unlimited plan: జియో యూజర్లకు బంపర్ ఆఫర్; ఉచితంగా అన్ లిమిటెడ్ డేటా ప్లాన్; ఆ కస్టమర్లకు ప్రత్యేకం
19 September 2024, 21:15 IST
Jio free unlimited plan: రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా జియోకు సంబంధించిన అన్న సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అంతరాయంపై యూజర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు జియో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.
జియో యూజర్లకు బంపర్ ఆఫర్; ఉచితంగా అన్ లిమిటెడ్ డేటా ప్లాన్
Jio free unlimited plan: రిలయన్స్ (reliance) జియో ఈ వారం ప్రారంభంలో దేశవ్యాప్తంగా నెట్ వర్క్ అంతరాయాన్ని ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వినియోగదారులు ఈ అంతరాయంతో ఇబ్బంది పడ్డారు. వారు తమ మొబైల్స్ నుంచి కాల్స్ చేయడం, ఇంటర్నెట్ ఉపయోగించడం, జియో ఫైబర్ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో అనేక ఫిర్యాదులు, చర్చలు జరిగాయి. ఆ తరువాత జియో సేవలను పునరుద్ధరించారు.
జియో యూజర్లకు కాంప్లిమెంటరీ ప్లాన్
నాటి అంతరాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ వినియోగదారులకు జియో ఒక కాంప్లిమెంటరీ ప్లాన్ ను అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోవడంతో జియో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లకు రిలయన్స్ జియో సుహృద్భావ సూచకంగా ఈ కాంప్లిమెంటరీ ప్లాన్ ను అందిస్తోంది.
ఏమిటీ కాంప్లిమెంటరీ ప్లాన్..?
జియో సేవలు నిలిచిపోవడంతో సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారులకు రెండు రోజుల పాటు ఉచితంగా అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ను ఇవ్వనున్నట్లు జియో వెల్లడించింది. ఈ మేరకు జియో పలువురు కస్టమర్లకు సందేశం పంపించింది. అందులో ‘‘డియర్ జియో యూజర్, దురదృష్టవశాత్తు, మంగళవారం ఉదయం, మీరు జియో సేవలలో సమస్యలను ఎదుర్కొన్నారు. సుహృద్భావ సంకేతంగా, మేము మీ నెంబరుకు 2 రోజుల కాంప్లిమెంటరీ అన్ లిమిటెడ్ ప్లాన్ ను వర్తింపజేశాం. ఈ ప్లాన్ యాక్టివేట్ అయిన వెంటనే దాని ప్రయోజనాలను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. మేము జియోతో మీ అనుభవానికి విలువ ఇస్తాము’’ అని జియో ఆ సందేశంలో పేర్కొంది.
ఏయే నగరాలు ప్రభావితమయ్యాయి?
సెప్టెంబర్ 17న ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాసిక్, కోల్ కతా, పాట్నా, గౌహతి సహా ప్రధాన నగరాల్లోని జియో సేవలకు అంతరాయం కలిగింది. జియో మొబైల్ వినియోగదారులు మరియు జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులు ఇద్దరూ అంతరాయాలను ఎదుర్కొన్నారు. బహుళ జియో సేవలను ఉపయోగించే వారు మరింత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా (social media) లో పలువురు యూజర్లు తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
ఎందుకీ అంతరాయం?
జియో ఐడీసీ డేటా సెంటర్ లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా దేశ వ్యాప్తంగా జియో (jio) సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనికి ప్రతిస్పందనగా, జియో రెండు రోజుల అపరిమిత డేటా ప్లాన్ ఆఫర్ వినియోగదారులకు అందిస్తోంది.