Income tax returns: పన్ను మినహాయింపు కోసం తప్పుడు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నారా?.. భారీ జరిమానా తప్పదు
21 June 2024, 14:38 IST
తప్పుడు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే భారీ జరిమానా తప్పదు. మీ పన్ను మినహాయింపులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో హెచ్ఆర్ఏను మోసపూరితంగా క్లెయిమ్ చేయాలనుకుంటే, అది భారీ జరిమానలకు దారి తీసే ప్రమాదముంది. అందువల్ల, హెచ్ఆర్ఏ సరిగ్గా ఎలా క్లెయిమ్ చేయాలో ఇక్కడ చూడండి.
హెచ్ఆర్ఏ తప్పుగా క్లెయిమ్ చేస్తే భారీ జరిమానా
ఇంటి అద్దె భత్యం (House Rent Allowance HRA) ను యజమానులు ఉద్యోగుల వేతనాల నుండి మినహాయిస్తారు. ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తున్నప్పుడు ఫామ్ 16 (Form 16) పార్ట్ బిలో ఈ వివరాలు ఉంటాయి. సెక్షన్ 10 (13ఏ) ప్రకారం అద్దె ఇంట్లో నివసిస్తేనే హెచ్ఆర్ఏ (HRA) మినహాయింపు పొందడానికి అర్హులు అవుతారు. వేతనం ద్వారా ఆదాయం పొందని వ్యక్తులు సెక్షన్ 80 జీజీ కింద వారి అద్దె ఖర్చులకు మినహాయింపు పొందవచ్చు. సొంత ఇంట్లో నివసిస్తున్న పన్ను చెల్లింపుదారులు హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనానికి అనర్హులన్న విషయం గుర్తుంచుకోవాలి. హెచ్ఆర్ఏను సరిగ్గా క్లెయిమ్ చేసుకోవడం చట్టబద్ధమైన అవసరం, అంతేకాదు, ఇది పన్ను చెల్లింపుదారులకు విలువైన పన్ను ఆదా సాధనం. మీ పన్ను ఆదాను గరిష్టంగా పెంచుకోవడానికి ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో హెచ్ఆర్ఏను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
హెచ్ఆర్ఏ క్లెయిమ్
కింద పేర్కొన్న వాటిలో అతి తక్కువ మొత్తం ఉన్న విధానాన్ని హెచ్ఆర్ఏ క్లెయిమ్ కు తీసుకుంటారు. అవి
- వాస్తవ హెచ్ఆర్ఏ
- వేతనంలో 50% (మెట్రో నగరాల్లో నివసించేవారికి) లేదా వేతనంలో 40% (మెట్రోయేతర నివాసితులకు).
- వాస్తవంగా చెల్లించిన అద్దె
హెచ్ ఆర్ ఏ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు
- ఇంటి యజమాని నుంచి తీసుకున్న అద్దె రశీదులు. ఇంటి అద్దె వార్షికంగా రూ .1 లక్ష దాటితే ఇంటి యజమాని పాన్ వివరాలు కూడా అవసరం అవుతాయి.
- రెంటల్ అగ్రిమెంట్
తప్పుగా హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే..
ఎక్కువ మొత్తంలో పన్ను మినహాయింపు పొందడానికి హెచ్ఆర్ఏ ను తప్పుగా చూపితే, అది భారీ జరిమానాలకు దారితీస్తుంది. మీరు మీ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తే, పన్నులో 50% అదనంగా జరిమానాగా విధిస్తారు. తప్పు హెచ్ఆర్ఏ ను చూపి ఎగవేసిన పన్ను మొత్తానికి 3 రెట్ల వరకు పెనాల్టీ కూడా విధించవచ్చు.