Hindenburg SEBI : ఈసారి సెబీ చీఫ్ టార్గెట్- హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు! అదానీతో..
11 August 2024, 6:07 IST
Hindenburg SEBI chief : సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్లపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌తో వారికి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.
సెబీ ఛీఫ్ మాధవి పురి బచ్..
‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌లో గుబులు రేపిన ప్రముఖ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్.. సంచలన ప్రకటనలు చేసింది. గతేడాది అదానీ గ్రూప్‌పై కీలక నివేదిక విడుదల చేసి స్టాక్ మార్కెట్ల పతనానికి కారణామైన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్ మాధవి పురి బచ్, ఆమె భర్తపై సంచలనం ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ స్టాక్స్‌ని ఆర్టిఫీషియల్‌గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్ అఫ్షోర్ ఫండ్స్‌లో మాధవి, ధవల్ బచ్‌లకు వాటాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం ఉందని వివరించింది. అందుకే అదానీ గ్రూప్‌పై గతేడాది సరిగ్గా విచారణ చేయలేదని పేర్కొంది.
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను సెబీ చీఫ్, ఆమె భర్త ఖండించారు.
అదానీతో సెబీ చీఫ్ కుమ్మక్కు..?
బిలియనీర్ గౌతమ్ అదానీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించిన 18 నెలల తర్వాత హిండెన్‌బర్గ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా తమ మీద వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
మారిషస్ రిజిస్టర్డ్ ఫండ్ ఐపీఈ ప్లస్ ఫండ్ 1, బెర్ముడాకు చెందిన గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్లలో మాధవి పురీ బచ్, ఆమె భర్త ధవల్ బచ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఆరోపించింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కి చెందిన వినోద్ అదానీ.. అనిల్ అహుజా స్థాపించి, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న గ్లోబల్ డైనమిక్ ఆపర్చ్యునిటీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు, ఆ ఫండ్ ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో పెట్టుబడులు పెట్టినట్టు హిండెన్‌బర్గ్ బ్లాగ్ పోస్ట్ వివరించింది. గౌతమ్ అదానీకి వినోద్ అన్నయ్య.
"అదానీ గ్రూప్‌లోని అనుమానిత ఆఫ్‌షోర్ వాటాదారులపై అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి సెబీ ఇష్టపడలేదు. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఉపయోగించిన అదే ఫండ్‌లో సెబీ చీఫ్ మాధవి బచ్ ప్రమేయం ఉండటం ఇందుకు కారణం అని మేము అనుమానిస్తున్నాము," అని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది.
ఈ పథకాలను నిర్వహించే ఐఐఎఫ్ఎల్ ప్రిన్సిపాల్ సంతకం చేసిన ఐపీఈ ప్లస్ ఫండ్ 1 కోసం ఫండ్స్ డిక్లరేషన్ స్టేట్మెంట్తో సహా విజిల్ బ్లోయర్ నుంచి వచ్చిన పత్రాలను ఉటంకిస్తూ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఈ వాదనలు చేసింది. ఈ పెట్టుబడికి మూలం "జీతం" అని, సెబీ చీఫ్, ఆమె భర్త నికర విలువ 2015 లో 10 మిలియన్ డాలర్లుగా అంచనా వెస్తున్నట్టు పేర్కొంది.
సెబీలో హోల్ టైమ్ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది వారాల ముందు 2017 మార్చి 22న మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ట్రైడెంట్ ట్రస్ట్‌కు మాధవి భర్త ధవల్ బచ్ పంపిన ఈమెయిల్‌ను హిండెన్ బర్గ్ ఉటంకించింది. గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్స్‌లో తమ హోల్డింగ్స్ ఖాతాలను నిర్వహించడానికి అధికారం ఉన్న ఏకైక వ్యక్తిగా ఉండాలని ధవల్ ఆ ఈమెయిల్లో అభ్యర్థించినట్టు వివరించింది. 2018 ఫిబ్రవరి 25న తన భర్త పేరుతో వ్యాపారం చేస్తున్న తన ప్రైవేట్ జీమెయిల్ ఖాతాను ఉపయోగించి ఇండియా ఇన్ఫోలైన్కు రాసిన ఈమెయిల్ని కూడా హిండెన్‌బర్గ్ ఉదహరించింది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ)లలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటైన గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ 2019లో బచ్ భర్త సలహాదారుగా నియమితులయ్యారని నివేదిక పేర్కొంది. బ్లాక్ స్టోన్‌కు చెందిన మైండ్ స్పేస్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ దేశంలోని రెండో, నాలుగో అతిపెద్ద ఆర్‌ఈఐటీలను వరుసగా ఆగస్టు 2020, మే 2023లో పబ్లిక్‌లోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధవల్ బచ్ సలహాదారుగా ఉన్న సమయంలో సెబీ ఆమోదించిన ఆర్ఈఐటీ చట్టాన్ని హిండెన్‌బర్గ్ బ్లాగ్ ఉదహరించింది. ఇది "బ్లాక్‌స్టోన్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుంది" అని పేర్కొంది.
సెబీ చీఫ్ స్పందన..
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు ఖండించారు. తమ జీవితాలు, ఆర్థిక పరిస్థితులు తెరిచిన పుస్తకం లాంటివని హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించారు. అవసరమైతే అన్ని పత్రాలను సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.
జనవరి 2023లో హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూప్ స్టాక్ ధరలు గణనీయంగా పడిపోవడానికి దారితీసింది. ఇది 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను కలిగించింది. ఏదేమైనా,షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఇప్పుడు గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు గరిష్ట స్థాయిని మించి మార్కెట్ క్యాపిటలైజేషన్ని కలిగి ఉంది.