GPF interest rate: జీపీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం; ఇతర ప్రావిడెంట్ ఫండ్లపై కూడా..
04 July 2024, 18:37 IST
GPF interest rate: 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) సహా పలు ఇతర భవిష్య నిధి పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీపీఎఫ్ వడ్డీ రేటు
GPF interest rate: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వడ్డీ రేట్లతో పాటు జూలై-సెప్టెంబర్ నెలలకు సంబంధించి పలు ప్రావిడెంట్ ఫండ్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం గురువారం వడ్డీ రేట్లను ప్రకటించింది. ‘‘2024-2025 సంవత్సరంలో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రావిడెంట్ ఫండ్లకు చందాదారులు జమ చేసిన మొత్తాలపై 2024 జూలై 1 నుండి 2024 సెప్టెంబర్ 30 వరకు 7.1% చొప్పున వార్షిక వడ్డీ రేటు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రేటు 2024 జూలై 1 నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది.
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు
2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీపీఎఫ్ (General Provident Fund GPF) పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటుంది. అంటే, జీపీఎఫ్ చందాదారులు ఈ సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో తమ జీపీఎఫ్ పై 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును పొందుతారు. జీపీఎఫ్ తో పాటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 7.1% వడ్డీ రేట్లను కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్ మెంట్ ప్రావిడెంట్ ఫండ్.. మొదలైనవి కూడా పొందుతాయి.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు
2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పై ఇదే కాలానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.7% గా ఉంది. అలాగే, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ (MIS) వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4% గా నిర్ణయించారు. మరోవైపు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి 7.5% వడ్డీ లభిస్తుంది.