Petrol under GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
Petrol under GST: పెట్రోల్, డీజిల్ లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనిపై తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పందించారు.
Petrol under GST: పెట్రోల్, డీజిల్ లను కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. శనివారం (జూన్ 22) న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ 53వ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ లపై జీఎస్టీ అనే ప్రశ్నపై స్పందించారు.
రాష్ట్రాలదే తుది నిర్ణయం: నిర్మల
పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై తుది నిర్ణయం రాష్ట్రాలదే అని, వాళ్లంతా దీనిపై కలిసి రావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. "మేము దీనిపై చర్చించలేదు. పెట్రోల్, డీజిల్ గురించి జీఎస్టీ అమలు సమయంలోనూ చర్చించలేదు. అరుణ్ జైట్లీ దీని గురించి మాట్లాడేవారు. రాష్ట్రాలు అంగీకరిస్తే కౌన్సిల్ లో దీనిపై చర్చించి ట్యాక్స్ రేటుపై నిర్ణయం తీసుకుంటాం. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టంలోకి తీసుకొస్తాం" అని ఆమె స్పష్టం చేశారు.
కేంద్రం మొదటి నుంచీ కూడా పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే అంటోందని తెలిపారు. "చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే నిబంధన ఇప్పటికే ఉంది. రాష్ట్రాలు దీనికి అంగీకరించడమే ఏకైక నిర్ణయం. ఆ తర్వాతే జీఎస్టీ కౌన్సిల్ లో రేట్లపై నిర్ణయం తీసుకుంటాం" అని మరోసారి నిర్మల తేల్చి చెప్పారు.
పెట్రోల్, డీజిల్ లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అదే జరిగితే ప్రజలపై చాలా భారం తగ్గుతుంది. జీఎస్టీలో గరిష్టంగా ఉన్న 28 శాతం పన్ను పరిధిలోకి వీటిని తీసుకొచ్చినా కూడా.. వీటి ధరలు చాలా తగ్గుతాయి. అయితే వీటిపై వ్యాట్ రూపంలో వస్తున్న పన్నును రాష్ట్రాలు కోల్పోతాయి. దీంతో దీనికి చాలా రాష్ట్రాలు అంగీకరించడం లేదు.
కేంద్రం కూడా గత కొన్నేళ్లుగా నెపాన్ని రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకుంటోంది. తాజా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోనూ దీనిపై చర్చించలేదని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. ఇప్పటికీ ఈ అంశంపై కేంద్రం అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది.