EPFO Interest Rate: మీ ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీని ఎలా లెక్కిస్తారు?
EPFO Interest Rate: ఉద్యోగి భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ప్రతీ సంవత్సరం ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆ లెక్క ప్రకారం, మీ పీఎఫ్ డిపాజిట్లపై మీకు లభించే వడ్డీని ఇలా లెక్కించండి.
ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ (EPFO) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుపై ఎంత వడ్డీ వస్తుందో ఇలా లెక్కించండి.
పదవీ విరమణ పథకం
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది ఒక పదవీ విరమణ పథకం. దీనిలో చాలా మంది ఉద్యోగులు తమ PFలను వారి యజమాని ద్వారా డిపాజిట్ చేస్తారు. ప్రతీ సంవత్సరం రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లకు ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే మీరు అందులో ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తే మంచి రాబడిని కూడా ఇస్తుంది.
జులై-ఆగస్టు నాటికి వడ్డీ జమ
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPFO)తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో వడ్డీని జమ చేస్తారు. మీ EPF ఖాతాలో రూ. 1 లక్ష, రూ. 3 లక్షలు లేదా రూ. 5 లక్షల డిపాజిట్లు ఉంటే, మీకు ఎంత రాబడి లభిస్తుందో ఇక్కడ చూడండి. వడ్డీ రేటును EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి, EPF ఖాతాదారులకు వారి ఖాతాలపై 0.10 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
EPFO: మీ జీతం నుండి PF ను ఎలా గణిస్తారు?
ఈపీఎఫ్ఓ (EPFO) చట్టం ప్రకారం, ఏ ఉద్యోగికైనా బేసిక్ పే మరియు డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అదేవిధంగా యజమాని కూడా 12 శాతం కాంట్రిబ్యూషన్‌ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ కాగా, 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)లో జమ చేస్తారు.
పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ
మీ EPF ఖాతాలో రూ. 1 లక్ష డిపాజిట్ గా ఉన్నట్లయితే, దానిపై 8.25 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. అంటే, మీ వడ్డీ సంవత్సరానికి రూ. 8,250 అవుతుంది. ఒకవేళ, మీ డిపాజిట్ రూ. 3 లక్షలు గా ఉంటే, వార్షికంగా రూ.24,500 వడ్డీ వస్తుంది. అదే, మీ పీఎఫ్ డిపాజిట్ రూ.5 లక్షలు ఉన్నట్లయితే,మీకు వార్షికంగా లభించే వడ్డీ రూ.41,250 అవుతుంది. ఉదాహరణకు, గత ఆర్థిక సంవత్సరంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం రూ. 10 లక్షల బ్యాలెన్స్ ఉందనుకోండి. అప్పుడు, గత సంవత్సరం వడ్డీ రేటు 8.15 శాతం ప్రకారం మీకు రూ. 81,500 వడ్డీ వస్తుంది.
ఆన్ లైన్ లో ఇలా చెక్ చేసుకోవచ్చు
EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను, అలాగే, వడ్డీని ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఉమంగ్ యాప్ లేదా EPFO పోర్టల్‌కి లాగిన్ కావాలి.
- EPFO పోర్టల్‌లో (www.epfindia.gov.in). ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్‌కి తీసుకెళ్తుంది. అందులో మీరు మీ UAN, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
- విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్‌బుక్ కోసం మెంబర్ ID ఎంపిక ఎంచుకోండి.
- పాస్‌బుక్ PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మీరు పాస్‌బుక్‌ని నేరుగా https://passbook.epfindia.gov.in/ లో కూడా యాక్సెస్ చేయవచ్చు.