Gukesh tax pay : ‘గెలిచింది గుకేశ్ కాదు- ఆర్థికశాఖ!’- చెస్ ఛాంపియన్ ప్రైజ్‌మనీలో భారీగా ‘ట్యాక్స్’ కోత..
16 December 2024, 7:20 IST
- Gukesh tax amount : వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ గెలవడంతో ఇప్పుడు ఫోకస్ అంతా భారత దేశ పన్ను వ్యవస్థపై పడింది! గుకేశ్ తన ప్రైజ్‌మనీపై భారీగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుండటంతో ఆర్థికశాఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుకేశ్ ప్రైజ్ మనీపై భారీగా ట్యాక్స్ కోత- నెట్టిజన్లు ఆగ్రహం!
అతి చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు గుకేశ్. చైనాకు చెందిన డింగ్ లైరెన్ని ఓడించి, 18ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. గుకేశ్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఈ చెస్ ప్లేయర్‌పై యావత్ భారత దేశం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే, కొందరు మాత్రం గుకేశ్ ప్రైజ్‌మనీపై పడే ‘ట్యాక్స్’ విషయాన్ని లేవనెత్తారు! ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్రైజ్‌మనీ, టోర్నీలో సంపాదించిన డబ్బుపై గుకేశ్ కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్‌ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ.. గుకేశ్ ఎంత ట్యాక్స్ కట్టాలంటే..
గుకేశ్ కట్టాల్సి ట్యాక్స్ ఎంతంటే..
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన గుకేశ్ ప్రైజ్‌మనీ దాదాపు రూ. 11కోట్లు. ఎఫ్ఐడీఈ రూల్స్ ప్రకారం టోర్నమెంట్‌లోని ప్రతి గెలుపుతో ప్లేయర్ రూ. 1.68కోట్లు సంపాదిస్తాడు. మిగిలినది టాప్ 2 ఫైనలిస్ట్‌ల మధ్య చెరిసగం అవుతుంది. ఇక ఈ ఛాంపియన్షిప్ పూర్తి ప్రైజ్‌మనీ రూ. 20.75కోట్లు. గుకేశ్ 3 గేమ్స్‌లో గెలిచాడు. అంటే రూ. 5.04 కోట్లు సంపాదించాడు. మిగిలిన 1.5మిలియన్ డాలర్స్‌ని గుకేశ్‌తో పాటు లైరెన్కి సగం సగం పంచారు. మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ద్వారా గుకేశ్ సుమారు 1.35 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఇది సుమారు రూ. 11కోట్లు.
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలుపుతో గుకేశ్ నెట్ వర్త్ రూ. 21కోట్లకు చెరిందని సమాచారం. ఇక గుకేశ్ 30శాతం ట్యాక్స్ స్లాబ్ కిందకి వస్తాడు. లెక్కలేస్తే.. తన ప్రైజ్‌మనీలో గుకేశ్ సుమారు రూ. 3కోట్ల వరకు పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే సర్ఛార్జ్తో పాటు ఇతర ఛార్జీలను కలుపుకుంటే ఇది రూ. 4.67 కోట్ల వరకు వెళుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
'రూ. 11కోట్ల ప్రైజ్‌మనీపై రూ. 4.67 కోట్ల ట్యాక్స్' వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఫైనాన్స్ మినిస్ట్రీపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గెలిచింది గుకేశ్ కాదు- ఆర్థికశాఖ అని సెటైర్లు వేస్తున్నారు.
"రూ. 11కోట్ల వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్‌మనీలో రూ. 5కోట్లు సంపాదించిన భారత ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నా శుభాకాంక్షలు," అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. "గెలుపులోనూ ఇన్కమ్ట్యాక్స్కి వాటా ఉండేలా చూసుకుంటారు. దేశంలో ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది," అని ఇంకొకరు అన్నారు.
"ఇది టీడీఎస్! అంటే.. ట్యాక్స్ డిడెక్టడ్ బై సీతారామన్" అని మరొకరు చెప్పుకొచ్చారు. “ఆదాయపు పన్నుశాఖ.. ఆట ఆడకుండానే గెలిచింది,” అని ఇంకొకరు అన్నారు.
దేశంలో ఉన్న అధిక పన్నులపై గత కొంతకాలంగా విపరీతంగా చర్చలు జరుగుతున్న సమయంలో గుకేశ్ ప్రైజ్‌మనీపై కట్టాల్సిన ట్యాక్స్ వార్త వెలుగులోకి వచ్చింది. ట్యాక్స్‌లను తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.