Budget 2024 : కేంద్ర బడ్జెట్‌ని అసలు ఎలా రూపొందిస్తారు? హల్వా వేడుక అంటే ఏంటి?
18 January 2024, 13:45 IST
- How is Budget 2024 prepared : కేంద్ర బడ్జెట్‌ని ఎలా రూపొందిస్తారు? దాని వెనుక ఎంత కసరత్తు ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాము..
కేంద్ర బడ్జెట్‌ని అసలు ఎలా రూపొందిస్తారు?
How is Budget prepared : ఫిబ్రవరి 1న.. కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఈసారి మధ్యంతర బడ్జెట్‌ని మాత్రమే ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తారు.
కేంద్ర బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. కోట్లాది భారతీయుల జీవితాన్ని మర్చే శక్తి బడ్జెట్‌కు ఉంటుంది. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ అంచనా రాబడులు, ఖర్చుల వివరాలు ఇందులో ఉంటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు కొనసాగే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తారు. అందుకే.. బడ్జెట్‌ని రూపొందించడంలో చాలా కసరత్తు ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాము..
బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారు?
Budget 2024 latest news : ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుందని, ఏప్రిల్ 1 లోపు బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. బడ్జెట్ రూపకల్పన సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి.. బడ్జెట్ తుది ముసాయిదాను రూపొందించడానికి నెలల తరబడి ప్రణాళిక, సంప్రదింపులు అవసరం. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు దాదాపు ఆరు నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే.. 2024 బడ్జెట్ కోసం.. 2023 ఆగస్టు-సెప్టెంబరులో చర్చలు ప్రారంభమవుతాయని అర్థం!
సర్క్యులర్ జారీ..
బడ్జెట్ తయారీ ప్రక్రియలో తొలి అడుగుగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు రూపొందించాలని చెబుతుంది. ఈ సర్క్యులర్లలో మంత్రిత్వ శాఖలు తమ డిమాండ్లను సమర్పించడంలో సహాయపడటానికి అవసరమైన మార్గదర్శకాలు ఉంటాయి. అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు అంచనాలను అందించడంతో పాటు గత సంవత్సరానికి తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించాల్సి ఉంటుంది.
ప్రతిపాదనలపై సమీక్ష
Budget 2024 date India : అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపిన ప్రతిపాదనలను రెవెన్యూ కార్యదర్శి స్వీకరిస్తారు. ప్రతిపాదనలను ప్రభుత్వ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా సమీక్షిస్తారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించడానికి వ్యయాల విభాగం, నీతి ఆయోగ్ విస్తృత సంప్రదింపులు నిర్వహిస్తాయి. వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు.
ఆదాయ, వ్యయాల అంచనాలు
వ్యయ విభాగం పంపిన డేటాను పరిశీలించిన అనంతరం.. ఆర్థిక మంత్రిత్వ శాఖలు మొత్తం బడ్జెట్ లోటును తెలుసుకోవడానికి ఆదాయ, వ్యయాల అంచనాలను సరిపోల్చుతాయి. మొత్తం బడ్జెట్ లోటును లెక్కిస్తారు. బడ్జెట్ లోటును పూడ్చడానికి ప్రభుత్వానికి అవసరమైన అప్పులను నిర్ణయించడానికి ఇప్పుడు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌ను సంప్రదిస్తుంది.
రెవెన్యూ కేటాయింపు
Budget 2024 expectations : అన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు వారి భవిష్యత్ ఖర్చుల కోసం ఆదాయాన్ని కేటాయిస్తుంది. నిధుల కేటాయింపుపై ఏవైనా విభేదాలు తలెత్తితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు కేంద్ర కేబినెట్ లేదా ప్రధానితో చర్చిస్తుంది.
బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు
బడ్జెట్ కేటాయింపు తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ భాగస్వాములతో బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరిపి.. వారి డిమాండ్లు, సిఫార్సులపై స్పష్టమైన అవగాహనను పొందుతుంది. ఇందులో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, రైతులు, ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాలు భాగస్వాములుగా ఉంటాయి.
బడ్జెట్‌కు ముందు సంప్రదింపుల సందర్భంగా లేవనెత్తిన అభ్యర్థనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రధానితో విస్తృతంగా చర్చించి.. ఆర్థిక మంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.
హల్వా వేడుక
What is Halwa ceremony : సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ 'హల్వా వేడుక'ను నిర్వహిస్తుంది. ఈ ప్రసిద్ధ భారతీయ స్వీట్‌ని భారీ కడాయిలో తయారు చేసి.. ఆర్థిక మంత్రి సిబ్బందికి వడ్డిస్తారు.
బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులను నార్త్ బ్లాక్ లోపల ఉన్న బడ్జెట్ ప్రెస్ వద్ద లాక్ చేస్తారు. ఆ ప్రక్రియకు ముందు హల్వా వేడుకను నిర్వహించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.
బడ్జెట్ సమర్పణ
చివరిగా.. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి డాక్యుమెంట్‌లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు.
ఈ సమర్పణ అనంతరం కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు పెడతారు. ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్‌ని తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్ అమల్లోకి వస్తుంది.