Shashi Tharoor: ‘బీజేపీ సీట్లు తగ్గుతాయి.. కానీ..’- లోక్ సభ ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ అంచనా
Shashi Tharoor's LS polls prediction: వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం థరూర్ పాల్గొన్నారు.
Shashi Tharoor's LS polls prediction: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అంచనా వేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో శశిథరూర్ మాట్లాడుతూ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో బీజేపీ లోక్ సభ సీట్లను గెలవలేదని అన్నారు.
అతిపెద్ద పార్టీ
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జోస్యం చెప్పారు. అయితే, సీట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి, మిత్రపక్షాలను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)పై విశ్వాసం కోల్పోయేలా చేయడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా బీజేపీని అడ్డుకోవచ్చని ఆయన అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 303 సీట్లు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 మార్కును అందుకోవడమే లక్ష్యంగా ఈ కూటమి పావులు కదుపుతోంది. బీజేపీకి సవాల్ విసిరేందుకు కాంగ్రెస్ తో పాటు మరో 27 ప్రతిపక్ష పార్టీలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి.
మిత్ర పక్షాలతో సమస్య
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న శశిథరూర్.. ఈ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీతో పొత్తుకు సుముఖంగా ఉండకపోవచ్చని, వారిలో కొందరు కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలున్నాయని అంచనావేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో 'ఇండియా: ది ఫ్యూచర్ ఈజ్ నౌ' అనే సెషన్ లో థరూర్ ప్రసంగించారు. తగినన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం ఒప్పందాలను విపక్ష కూటమి పార్టీ సమర్ధవంతంగా కుదుర్చుకుంటే బీజేపీని ఓడించవచ్చని శశిథరూర్ అన్నారు. కేరళలో సిపిఎం, కాంగ్రెస్ లు సీట్ల పంపకాలకు అంగీకరించడం అసాధ్యమని శశిథరూర్ వ్యాఖ్యానించారు.