Budget 2024: మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి?.. ఏయే సందర్భాల్లో దీనిని ప్రవేశపెడ్తారు?
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, మధ్యంతర బడ్జెట్ అంటే ఏమటి? ఏయే సందర్భాల్లో దీనిని ప్రవేశపెడ్తారు? తదితర పూర్తి వివరాలు మీ కోసం..
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెడ్తారు.
మధ్యంతర బడ్జెటే..
ఈ ఏడాది ఫిబ్రవరి 1న తాను ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెట్ (interim budget) మాత్రమేనని నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇది సార్వత్రిక ఎన్నికలకు ముందు 'ఓట్ ఆన్ అకౌంట్ (vote-on-account)' మాత్రమేనని నిర్మలా సీతారామన్ చెప్పారు. అది ఓట్ ఆన్ అకౌంట్ కనుక అందులో ప్రత్యేకమైన ప్రకటనలేవీ ఉండవు. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చి 2024 జూలైలో తదుపరి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి ఉండాలి" అని సిఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఫోరంలో ఇచ్చిన ప్రసంగంలో మంత్రి వివరించారు.
2019 లో కూడా..
2019లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించిన పీయూష్ గోయల్ 2019లో చివరి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా రెండవసారి విజయం సాధించిన తరువాత, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. దాంతో, ఆమె జూలై 5, 2019 న పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మధ్యంతర బడ్జెట్ అంటే?
రాజ్యాంగంలోని 116 సెక్షన్ ప్రకారం మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెడ్తారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వానికి వచ్చే రాబడులు, ప్రభుత్వం చేసే వ్యయాలను మధ్యంతర బడ్జెట్ లో వివరిస్తారు. దీనికి విరుద్ధంగా, ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలు, కేటాయింపులు, విధాన ప్రకటనలతో సహా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలు సమగ్ర బడ్జెట్ లో ఉంటాయి. నిజానికి సమగ్ర బడ్జెట్ ను ఆర్థిక రంగంలో ప్రభుత్వ విధాన ప్రకటనగా భావించవచ్చు. పూర్తి సంవత్సర బడ్జెట్ అనేది ఒక వ్యూహాత్మక మార్గదర్శి. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశిస్తుంది. మధ్యంతర బడ్జెట్ తాత్కాలిక కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రమే అందిస్తుంది.
విధాన ప్రకటనలు ఉండవు
2024 ఏప్రిల్, మే నెలల్లో లోక సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం 2024 జూలైలో పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే 2024-25 మధ్యంతర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడ్తారు. రాజ్యాంగంలో నిషేధం లేనప్పటికీ, సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ సమయంలో ప్రధాన విధాన ప్రకటనలు చేయరు. మధ్యంతర బడ్జెట్ ను 'ఓట్ ఆన్ అకౌంట్' అని కూడా పిలుస్తారు. ఎన్నికల సమయంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావం పడకుండా భారత ఎన్నికల సంఘం విధించిన కొన్ని పరిమితులు పరిధిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు. అధికార పక్షానికి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం బడ్జెట్లో ప్రధాన పన్నులు లేదా విధాన సంస్కరణలను ప్రతిపాదించదు.
ఎకనమిక్ సర్వే కూడా ఉండదు..
సాధారణ బడ్జెట్ ను సమర్పించడానికి ఒక రోజు ముందు ప్రభుత్వం ఎకనమిక్ సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తుంది. అయితే, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో, ఈ ఎకనమిక్ సర్వేను ప్రవేశపెట్టరు. ఆర్థిక స్థితిగతులు, కీలక ఘట్టాలను వివరించే ఈ సర్వేను సాధారణంగా జూలైలో పార్లమెంటులో పూర్తి బడ్జెట్ తో పాటు ప్రవేశపెడతారు. సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ రెండు నెలల పాటు అమల్లో ఉంటుంది. అవసరమైతే పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.