Carrot Halwa: ప్రెషర్ కుక్కర్లో క్యారెట్ హల్వా ఇలా సులువుగా చేసేయండి
Carrot Halwa: క్యారెట్ హల్వాను సులువుగా కుక్కర్లో చేసేయొచ్చు. క్యారెట్ హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
Carrot Halwa: క్యారెట్ హల్వా ఇప్పుడు అందరి ఫేవరెట్ వంటకం. దీన్ని చేయడం కష్టం అనుకుంటారు చాలామంది. నిజానికి ప్రెషర్ కుక్కర్లో లేదా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో దీన్ని సులువుగా వండేయచ్చు. పిల్లలకి అప్పుడప్పుడు దీన్ని పెడితే మంచిది. ఇది ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకే వస్తుంది. అయితే పంచదారను మాత్రం తక్కువగా వాడితే మంచిది. ప్రెషర్ కుక్కర్లో క్యారెట్ హల్వాను ఎలా వండాలో చూద్దాం.
క్యారెట్ హల్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు - నాలుగు
పాలు - రెండు కప్పులు
పంచదార - పావు కప్పు
నట్స్ - గుప్పెడు
క్యారెట్ హల్వా రెసిపీ
1. క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి.
3. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి వేసి వేయించుకోవాలి.
4. అవి రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని వేసి తరిగిన క్యారెట్లను వేయాలి.
6. వీటిని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
7. అవి కాస్త మెత్తగా అయ్యాక అందులో రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి.
8. మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.
9. తర్వాత మూత తీస్తే క్యారెట్లు మెత్తగా పేస్టులా ఉడికిపోతాయి.
10. గరిటతో బాగా కలపాలి. ఇప్పుడు పావు కప్పు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.
11. హల్వాలాగా దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
12. పైన కాస్త నెయ్యి, డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయినట్టే.
క్యారెట్లో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, బయోటిన్, విటమిన్ b6, పొటాషియం, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే శరీరానికి ప్రోటీన్ అందుతుంది. కంటి చూపు మెరుగవ్వడానికి క్యారెట్ ఎంతో సహాయపడుతుంది. పిల్లలకు ప్రతిరోజూ పెట్టాల్సిన కూరగాయల్లో క్యారెట్ ఒకటి. కనీసం రోజుకు ఒకటైన పిల్లల చేత తినిపించడం చాలా అవసరం.
టాపిక్