Bajaj CNG motorcycle: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ లాంచ్ ను వాయిదా వేసిన బజాజ్ ఆటో
11 June 2024, 20:52 IST
Bajaj CNG motorcycle: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్ సైకిల్ ను బజాజ్ ఆటో రూపొందించింది. ఈ బైక్ ను జూన్ 18న లాంచ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజాగా, ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ లాంచ్ ను వాయిదా వేస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది.
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ లాంచ్ వాయిదా
Bajaj CNG motorcycle: ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎన్జీ బైక్ విడుదలను జూలై 17, 2024 కు వాయిదా వేసింది. మొదట ఈ బజాజ్ సీఎన్ జీ మోటార్ సైకిల్ జూన్ 18 న లాంచ్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని బజాజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 400 జెడ్ బైక్ ను విడుదల చేస్తున్న సందర్భంగా వెల్లడించారు. అయితే లాంచ్ తేదీని కొన్ని వారాలు వాయిదా వేసినట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మంగళవారం ధృవీకరించారు.
లాంచ్ వాయిదాకు కారణమేంటి?
అయితే, జూన్ 18న లాంచ్ కావాల్సిన తొలి సీఎన్జీ బైక్ ను జులై 17వ తేదీకి ఎందుకు వాయిదా వేశారనే విషయంలో స్పష్టత లేదు. బజాజ్ ఆటో ఈ ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ను అంతర్గతంగా ‘బ్రూజర్’ అనే కోడ్ నేమ్ తో పిలుస్తారు. లాంచ్ సమయంలోనే ఈ బైక్ ఒరిజినల్ పేరును వెల్లడించనున్నారు. ఈ బైక్ పూర్తిగా భిన్నమైన పేరు కలిగి ఉంటుందని రాకేశ్ శర్మ ధృవీకరించారు.
100-150 సీసీ సెగ్మెంట్ లో పోటీ
రాబోయే బజాజ్ సీఎన్జీ బైక్ కమ్యూటర్ సెగ్మెంట్ లో, ముఖ్యంగా 100-150 సీసీ స్పేస్ లో ఇప్పటికే మార్కెట్లో సక్సెస్ అయిన ఇతర బైక్ లతో పోటీ పడనుంది. మొదట ఈ తొలి సీఎన్జీ బైక్ ను పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్లతో, 125 సీసీ ఇంజన్ తో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఆ తరువాత, వివిధ సీసీ సెగ్మెంట్లలో ఇతర సీఎన్జీ బైక్ లను మార్కెట్లోకి తీసుకురావాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది.
రెండు ఇంధన ట్యాంకులు
రాబోయే బజాజ్ సీఎన్జీ మోటార్ సైకిల్ రెండు ఇంధన ట్యాంకులను కలిగి ఉంటుందని గతంలో లీకైన వివరాలు వెల్లడించాయి. వాటిలో ఒకటి పెట్రోల్ ఫ్యుయల్ ట్యంక్ కాగా, మరొకటి సీఎన్జీ ట్యాంక్. ఇందులోని ఇంజన్ ఈ రెండు ఇంధనాలతో నడిచేందుకు అనుకూలంగా ఉంటుందని, సీఎన్ జీ నుండి పెట్రోల్ కు లేదా పెట్రోలు నుంచి సీఎన్జీకి మారినప్పుడు పనితీరులో ఎటువంటి మార్పు ఉండదని బజాజ్ కంపెనీ స్పష్టం చేసింది.
అతి తక్కువ మెయింటెనెన్స్
బజాజ్ నుండి వస్తున్న ఈ సీఎన్జీ బైక్ ద్విచక్ర వాహన రంగంలో ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ఇదే సెగ్మెంట్ లో సంప్రదాయ పెట్రోల్ తో నడిచే మోటార్ సైకిళ్లతో పోలిస్తే దీని ఇంధన ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు 50 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ధరను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించనున్నారు.
భారీ డిమాండ్
సీఎన్జీ మోటార్ సైకిల్ లకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ ను శాసిస్తున్న హీరో మోటోకార్ప్, టీవీఎస్, హోండా వంటి ప్రఖ్యాత కంపెనీలకు చెందిన సంప్రదాయ కమ్యూటర్ మోటార్ సైకిళ్లతో ఇది పోటీ పడనుంది.