తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Air India Express Crisis: ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మడి సెలవులు; పలు ఫ్లైట్స్ రద్దు; ప్రయాణికుల ఆగ్రహం

Air India Express crisis: ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మడి సెలవులు; పలు ఫ్లైట్స్ రద్దు; ప్రయాణికుల ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

08 May 2024, 12:43 IST

google News
  • టాటా గ్రూప్ సారధ్యంలోని ఎయిర్ ఇండియా మరో సంక్షోభంలో చిక్కుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ క్యాబిన్ సిబ్బంది అనధికారికంగా సమ్మెకి దిగారు. అనూహ్యంగా బుధవారం సామూహికంగా సిక్ లీవ్స్ పెట్టారు. దాంతో, పలు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు రద్దు అయ్యాయి. ఈ పరిణామంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

పలు ఎయిరిండియా విమానాలు రద్దు
పలు ఎయిరిండియా విమానాలు రద్దు (Reuters)

పలు ఎయిరిండియా విమానాలు రద్దు

Air India Express crisis: క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సామూహికంగా సిక్ లీవ్స్ పెట్టడంతో కొన్ని విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. గత రాత్రి నుంచి తమ క్యాబిన్ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైనట్లుగా తమకు సమాచారమిచ్చారని, దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పరిణామం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వారికి రీఫండ్ కానీ, ఫ్లైట్స్ రీ షెడ్యూల్ కానీ చేస్తామన్నారు.

ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ క్షమాపణలు

ఈ అనుకోని అంతరాయానికి చింతిస్తున్నామని, ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నామని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి తెలిపారు. విమానాలు రద్దు కావడం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా కాంప్లిమెంటరీ రీషెడ్యూల్ మరొక తేదీకి ఇస్తామని తెలిపారు. మే 8వ తేదీన ప్రయాణాలు షెడ్యూల్ చేసుకున్న ప్రయాణికులు తాము ఇంటి నుంచి బయల్దేరే ముందే తమ ఫ్లైట్ రద్దు అయిందో? లేదో? కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించారు.

సిబ్బంది అసంతృప్తి

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సంస్థ క్యాబిన్ క్రూలోని ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) గత నెలలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పై విమర్శలు చేసింది. సంస్థ నిర్వహణ బాగాలేదని, సిబ్బంది మధ్య వివక్ష చూపుతోందని విమర్శించింది. విస్తారా ఎయిర్ లైన్స్ విలీనంపై కూడా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. సంస్థ యాజమాన్యం తీరు వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని యూనియన్ ఆరోపించింది.

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ రద్దుపై ప్రయాణికుల ఆగ్రహం

ఎయిర్ ఇండియా విమానాలు అకస్మాత్తుగా రద్దవడంపై కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. విమాన రద్దు గురించి ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక ప్రయాణికుడు చేసిన పోస్ట్ కు స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ‘ఆపరేషనల్ కారణాల వల్ల’ విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ‘మా సర్వీస్ రికవరీ ప్రక్రియలో భాగంగా, మీరు రాబోయే 7 రోజుల్లో విమానాన్ని రీషెడ్యూల్ చేయడానికి ఎంచుకోవచ్చు లేదా మా చాట్ బాట్ టియా ద్వారా పూర్తి రీఫండ్ అభ్యర్థించవచ్చు’ అని సూచించింది.

తదుపరి వ్యాసం