Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..
Air India Cabin Baggage: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం పెట్టుకున్నారా? క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిపై ఇటీవల ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం తెలుసా? క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని ఇటీవల ఎయిర్ ఇండియా తగ్గించింది.
Air India Cabin Baggage: ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో అతి తక్కువ ఎకానమీ ఛార్జీల విభాగంలో ఉచిత క్యాబిన్ బ్యాగేజీ పరిమితిని 20 కిలోల నుండి 15 కిలోలకు తగ్గించింది. మే 2వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. మెన్యూ బేస్డ్ ప్రైసింగ్ మోడల్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అందరికీ ఒకే తరహా సేవలు ఇకపై సాధ్యం కాదని టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
మూడు విభాగాలు..
ప్రస్తుతం ఎయిర్ ఇండియా (Air India) లో మూడు ధరల విభాగాలు ఉన్నాయి. అవి కంఫర్ట్ (Comfort), కంఫర్ట్ ప్లస్ (Comfort Plus), ఫ్లెక్స్ (Flex). వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న ఈ విభాగాల్లో లభించే ప్రయోజనాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. మే 2 నుండి అమల్లోకి వచ్చేలా, ‘కంఫర్ట్’ మరియు ‘కంఫర్ట్ ప్లస్’ కేటగిరీలకు ఉచిత క్యాబిన్ బ్యాగేజీ అలవెన్స్ ను 15 కిలోలకు తగ్గించారు. గతంలో కంఫర్ట్ కేటగిరీ కి ఉచిత క్యాబిన్ బ్యాగేజ్ పరిమితి 20 కేజీలు, కంఫర్ట్ ప్లస్ కేటగిరీ కి ఉచిత క్యాబిన్ బ్యాగేజ్ పరిమితి 25 కేజీలుగా ఉండేది.
బిజినెస్ క్లాస్ కు సెపరేట్
డొమెస్టిక్ రూట్లలో బిజినెస్ క్లాస్ లగేజీ అలవెన్స్ 25 కిలోల నుండి 35 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలలో ఉచిత బ్యాగేజీ అలవెన్స్ మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుందని ఎయిర్ ఇండియా (Air India) ప్రతినిధి చెప్పారు. ఇతర దేశీయ విమానయాన సంస్థలలో కూడా, ప్రయాణీకులు అదనపు ఛార్జీ లేకుండా 15 కిలోల క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తో పాటు ఎయిర్ ఇండియా (Air India) స్వంత సమగ్ర అధ్యయనం ఆధారంగా ఈ ఛార్జీల కేటగిరీలను పరిచయం చేశామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ 2022లో ప్రభుత్వం నుండి కొనుగోలు చేసింది.
ప్రయాణీకుల అవసరాల మేరకు చార్జీల కేటగిరీలు..
ప్రయాణీకులు తమ అవసరాలకు సరిపోయే రకమైన ఛార్జీలు, సేవలను ఎంచుకోవడానికి వీలుగా ఈ చార్జీల కేటగిరీలను రూపొందించామని ఎయిర్ ఇండియా (Air India) వెల్లడించింది. ‘ఈ రోజు ప్రయాణికులు విభిన్న ప్రాధాన్యతలను కలిగి ఉన్నారు అందరికీ సరిపోయే ఒకే విధానం ఇకపై అనువైనది కాదు’’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, ఢిల్లీ-ముంబై వంటి దేశీయ సెక్టార్‌లో 'కంఫర్ట్ ప్లస్', 'ఫ్లెక్స్' ఛార్జీల మధ్య ధర వ్యత్యాసం సాధారణంగా రూ. 1,000 ఉంటుందని, 'ఫ్లెక్స్' కేటగిరీలో స్వల్ప అదనపు చార్జీతో 10 కిలోల అదనపు బ్యాగేజీకి అనుమతి ఉంటుంది. జీరో క్యాన్సిలేషన్ ఫీ వంటి ప్రయోజనం కూడా ఉంటుంది.