Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్
Air India-Vistara merger: చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న ఎయిర్ ఇండియా - విస్తారా విమానయాన సంస్థల విలీనంపై టాటా సన్స్ సంస్థ కీలక అప్ డేట్ ను ఇచ్చింది. ఈ విలీనాన్ని ఇంకా వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరిలోగా విలీనం పూర్తవుతుందని వెల్లడించింది.
Air India-Vistara merger: భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా (Air India), విస్తారా (Vistara) లను విలీనం చేయాలన్న ప్రతిపాదన చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. విమాన యాన రంగంలో విస్తారా బ్రాండ్ ను టాటా గ్రూప్ (Tata Group) కొనసాగించబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, లేటెస్ట్ గా ఈ విషయంలో టాటా సన్స్ ఒక వివరణ ఇచ్చింది.
ఈ ఏడాది చివరి లోగా..
2024 సంవత్సరం చివరిలోగా ఎయిర్ ఇండియా, విస్తారా విమానయాన సంస్థల విలీనం (Air India-Vistara merger) పూర్తవుతుందని టాటా సన్స్ ప్రకటించింది. ఈరెండు సంస్థల విలీనానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, దీనికి సంబంధించి డీజీసీఏకు వెల్లడించిందని తెలిపింది. విస్తారా సంస్థ నుంచి ఉద్యోగులను ఎయిర్ ఇండియా (Air India) కు మార్చే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపింది. ఈ విలీనంతో టాటా గ్రూప్ విమానయాన వ్యాపారం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. ఎయిర్‌ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను విలీనం చేసి ఒకే బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థను రూపొందించిన విషయం తెలిసిందే.
సింగపూర్ ఎయిర్ లైన్స్ ఆమోదం
‘‘ఎయిర్ ఇండియా, విస్తారాల విలీనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఈ విషయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా సన్స్ రెండూ త్వరలో విలీనాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాయి’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.డీజీసీఏ నుంచి అనుమతులు రాగానే విలీన ప్రక్రియను ముగించాలనుకుంటున్నాయి. విస్తారా బ్రాండ్ ను 2025 చివరి వరకు కొనసాగించాలని టాటా గ్రూప్ (Tata Group) మొదట్లో భావించింది. అయితే, ఇప్పుడు ఆ ఆలోచనను విరమించున్నట్లు తెలుస్తోంది. ‘‘ఎప్పటికైనా విస్తారా (Vistara) బ్రాండ్ ఎయిర్ ఇండియా (Air India) గా మారక తప్పదు. అందువల్ల విలీనాన్ని ఆలస్యం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని టాటా గ్రూప్ భావిస్తోంది’’ అని సంబంధిత ప్రక్రియలో పాలుపంచుకుంటున్న వ్యక్తి చెప్పారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలు
వచ్చే వారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుండి విలీనానికి ఆమోదం లభిస్తుందని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ఎన్‌సీఎల్‌టీ కి చెందిన చండీగఢ్ బెంచ్ ఈ కేసులో ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI) సెప్టెంబర్ 2023లో రెండు విమానయాన సంస్థల మధ్య విలీనాన్ని ఆమోదించింది. ఎన్‌సీఎల్‌టీ నుండి విలీనానికి ఆమోదం లభించిన వెంటనే రెండు విమానయాన సంస్థలు తమ నెట్‌వర్క్‌లు, మానవ వనరులు, విమానాల విస్తరణలను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తాయి.