YS Jagan District Tours : సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ - కార్యకర్తలతోనూ భేటీలు!
30 November 2024, 8:44 IST
- YS Jagan District Tours : ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటిస్తానని… బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానని ప్రకటించారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్
పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ దృష్టిపెట్టారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాడుతూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై జగన్ కీలక ప్రకటన చేశారు.
వైఎస్ జగన్ కీలక ప్రకటన
శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ… సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని చెప్పారు. ప్రతి బుధ, గురువారం జిల్లాలోనే బస చేస్తానని.. కార్యకర్తలతో మమేకమవుతాని ప్రకటించారు. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు ఉంటాయని జగన్ తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం రోజుకు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే కార్యచరణను సిద్ధం చేస్తామని… సమీక్షలు నిర్వహిస్తామని వివరించారు.
అబద్ధాలు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కర్నీ ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితులు కనిపించాయని గుర్తు చేశారు. సాధ్యం కాని హామీలను చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే సాధ్యం కానీ హామీలను వైసీపీ ఇవ్వలేదని చెప్పినట్లు జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం తీరుతో ప్రజలు డైలామాలో పడిపోయారని అన్నారు. పథకాలను పూర్తిగా పక్కనపెట్టేశారని దుయ్యబట్టారు. కూటమి పాలనలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రెయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇలా అనేక పథకాల డబ్బులు పెండింగ్ లో పెట్టారని ఆక్షేపించారు.
కూటమి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ దిగజారిపోయిందంటూ జగన్ విమర్శలు గుప్పించారు. ఏదైనా ప్రమాదం జరిగి 108కి కాల్ చేసినా.. అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఈరోజు లేదన్నారు. బకాయిలు ఉండటంతో 108 సిబ్బంది సమ్మెలో ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న జగన్… దళారులు కొనే వరకూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదని ఫైర్ అయ్యారు.
పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతామని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అందరూ ధైర్యంతో పోరాడాలని సూచించారు. ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలన్నారు. కూటమి సర్కార్ పై ప్రజా వ్యతిరేక పెరుగుతోందని.. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారని చెప్పుకొచ్చారు.