YS Bhaskar Reddy: అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు
26 May 2023, 16:47 IST
- Avinash Reddy's father YS Bhaskar Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నభాస్కర్ రెడ్డిని… జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత!
YS Bhaskar Reddy Latest News: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు పెరగడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. చికిత్స తర్వాత మళ్లీ చంచల్ గూడకు తీసుకెళ్లగా... అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని శుక్రవారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈ నెల 19 నుంచి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే దిశగా సీబీఐ అడుగులు వేస్తోంది. అయితే అవినాశ్ రెడ్డి… కోర్టులను ఆశ్రయిస్తుండటం, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐని కోరటం వంటి పరిణామాలు చోటు చేసుకోవటంతో… అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ ఎలా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
గంగిరెడ్డి బెయిల్ పై స్టే…
Erra Gangireddy Bail: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టులో ఇటీవల లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డికి గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. జులై1న ఎర్ర గంగిరెడ్డిని విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించడంపై వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు మంజూరు చేసిన సమయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిందితుడిని మళ్లీ ఎప్పుడు విడుదల చేయాలో కూడా ముందే నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు.హైకోర్టు ఉత్తర్వులపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్రగంగిరెడ్డి, సిబిఐలకు సుప్రీం కోర్టు గత వారం నోటీసులు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు 2019లో డిపాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతని బెయిల్ రద్దు కోసం సిబిఐ పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. ఛార్జిషీట్ వేయకపోవడంతో బెయిల్ మంజూరు కావడంతో గతంలో ఏపీ హైకోర్టు దానిని సమర్థించింది. ఆ తర్వాత కేసు విచారణ తెలంగాణకు మారింది. సిబిఐ వినతి నేపథ్యంలో గత నెలలో నిందితుడు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని, బెయిల్ రద్దు చేసింది. అదే సమయంలో నిందితుడికి డిఫాల్ట్‌గా జులై 1న విడుదల చేయాలని సూచించింది.తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారు మారు చేసే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు.
ఏప్రిల్ నెల 27న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ.. మే 5వ తేదీ లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును జూన్ 30 లోపు ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో గంగిరెడ్డిని జులై 1న పూచీకత్తు తీసుకొని బెయిల్‌పై విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది.వాదనలు ప్రారంభమైన వెంటనే సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు ఉత్తర్వుల గురించి ధర్మాసనానికి వివరించారు. ఇదో విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన సీజేఐ ఒకవైపు బెయిల్ రద్దు చేస్తూనే మరోవైపు ఫలానా రోజు విడుదల చేస్తున్నాం అని చెప్పడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.