Sajjala On Avinash Reddy :అవినాష్ రెడ్డి వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధంలేదు, సజ్జల సంచలన వ్యాఖ్యలు
23 May 2023, 15:58 IST
- Sajjala On Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ కు కొన్ని రోజులు టైం ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధంలేదన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala On Avinash Reddy : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైసీపీ ఘనవిజయం సాధించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయన్నారు. అభివృద్ధి అంటే నాలుగు ఫ్యాక్టరీలు పెట్టడం కాదన్నారు సజ్జల. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయన్నారు.
అభివృద్ధి అంటే చిన్న ఫ్యాక్టరీలు 4, 5 పెట్టడం కాదు
మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేశారని సజ్జల గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలు అమలు చేశారన్నారు. పాలన వికేంద్రకరణతో అన్ని ప్రాంతాలకు న్యాయం చేశామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పేదలకు అనుకూలంగా జగన్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో నాలుగు పోర్టులను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి అంటే చిన్న ఫ్యాక్టరీలు 4, 5 పెట్టడం కాదని సజ్జల తెలిపారు. మూడు రాజధానుల అంశం కోర్టు వివాదాలు దాటితే ఆదర్శమైన పాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 2019 కన్నా మించిన విజయం ప్రజలు అందించాలని కోరారు. గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రం కోసం ఏం సాధించలేకపోయారని సజ్జల విమర్శించారు. తన వ్యక్తిగత పనులు మాత్రమే పూర్తిచేసుకున్నారని, అంతే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన కీలకమైన ప్రాజెక్టు అని సజ్జల తెలిపారు. ఇటువంటి అంశాలపై చర్చ చేయకుండా, రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి అవినాష్ వ్యవహారానికి సంబంధం లేదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అవినాష్ తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలంటూ ప్రచారం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరుసార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారని గుర్తుచేశారు. అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిపై తప్పుడు కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మీడియాపై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న ఆయన... కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీబీఐ, పోలీసులను అవినాష్ అరెస్ట్ కోసం సహకరించమని అడిగారా? డిపార్ట్మెంట్ల మధ్య జరిగిన విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి టైం అడిగారని, ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి అవినాష్ రెడ్డికి వ్యవహారానికి సంబంధం లేదన్నారు.