తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Domestic Violence: అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు.. ఏప్రిల్‌లో పెళ్లి.. ఆగస్టులో సూసైడ్

Domestic Violence: అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు.. ఏప్రిల్‌లో పెళ్లి.. ఆగస్టులో సూసైడ్

HT Telugu Desk HT Telugu

27 August 2024, 13:14 IST

google News
    • Domestic Violence: పెళ్లైన నెల రోజుల నుంచే అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు పెరిగాయి. దీంతో వివాహం జరిగిన నాలుగు నెల‌ల‌కే వివాహిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న వివాహిత ఇంట్లో విషాదం నింపింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు షమిత
మృతురాలు షమిత

మృతురాలు షమిత

ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా గండేప‌ల్లికి చెందిన కృష్ణ ప్ర‌వీణ్ కుమార్‌తో.. బోర‌బండకు చెందిన ష‌మిత (29) వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 20న జ‌రిగింది. వివాహం స‌మ‌యంలో పెద్ద‌లు నిర్ణ‌యించిన మేర‌కు రూ.2.50 ల‌క్ష‌ల న‌గ‌దు, బంగారం క‌ట్నంగా ఇచ్చారు. కానీ.. అవి సరిపోలేదని.. పెళ్లైన నెల రోజుల‌కే అద‌న‌పు క‌ట్నం కోసం భ‌ర్త, అత్త‌, తోటి కోడ‌లు వేధింపులు స్టార్ట్ చేశారు.

భౌతిక దాడికి దిగేవారు..

ముగ్గురూ కలిసి ష‌మిత‌పై భౌతిక దాడికి దిగేవారు. అన్ని దిగ‌మింగుకొని ష‌మిత కాపురం చేసేది. కానీ అత్త‌, తోటి కోడ‌లు చేష్ట‌లు శ్రుతిమించ‌డం, భ‌ర్త వారికి వ‌త్తాసు ప‌ల‌క‌డంతో.. ష‌మిత‌కు ఏం చేయాలో తెలియ‌లేదు. అన్ని తానే అనుకున్న భ‌ర్త కూడా త‌న వైపు లేకుండా.. సూటిపోటి మాట‌ల‌తో ఇబ్బంది పెట్టడం వ‌ల్ల ష‌మిత తీవ్ర మనస్తాపం చెందింది.

హైదరాబాద్‌లో కాపురం..

ఈ నేపథ్యంలోనే.. ష‌మిత దంప‌తులు తమ దంపతులు కాపురాన్ని హైద‌రాబాద్‌కు మార్చారు. 10 రోజుల కిందట న‌గ‌రానికి వ‌చ్చి.. హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని సాయిన‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. ఇక‌నైనా బాగుండొచ్చ‌ని.. అత్త‌, తోటి కోడ‌లు వేధింపులు ఉండ‌వ‌ని ష‌మిత భావించింది. ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌పొచ్చ‌ని అనుకుంది. కానీ.. ఇక్క‌డికి వ‌చ్చినా ఆనందం లేదు. అత్త‌, ఆడ‌ప‌డుచు మాట‌లు విని భ‌ర్త వేధింపులు పెరిగాయి.

భ‌ర్త‌ను ఎదిరించ‌లేక‌..

భ‌ర్త‌ను ఎదిరించ‌లేక‌.. పుట్టింటికి వెళ్ల‌లేక ఇక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో ష‌మిత బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. లోప‌లి నుంచి గ‌డియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇంటి ఓన‌ర్‌తో క‌లిసి భ‌ర్త కృష్ణ ప్ర‌వీణ్ కుమార్.. త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి వెళ్లి చూసేస‌రికి ఉరి వేసుకుని నిర్జీవంగా ఉంది.

వెంటనే ష‌మిత త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు అక్క‌డికి చేరుకుని క‌న్నీరుమున్నీరుగా విలపించారు. అత్త‌, తోటి కోడ‌లు వేధించార‌ని ష‌మిత త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు.. హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీసులు వెల్లడించారు. ష‌మిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం