Jogi Ramesh : అగ్రిగోల్డ్ లో మా తప్పుంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరివేసుకుంటాం - మాజీ మంత్రి జోగి రమేష్-vijayawada police notice to jogi ramesh on chandrababu house attack case jogi ramesh fires on tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jogi Ramesh : అగ్రిగోల్డ్ లో మా తప్పుంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరివేసుకుంటాం - మాజీ మంత్రి జోగి రమేష్

Jogi Ramesh : అగ్రిగోల్డ్ లో మా తప్పుంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరివేసుకుంటాం - మాజీ మంత్రి జోగి రమేష్

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2024 02:59 PM IST

Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడ్ని ఏసీబీ అదుపులోకి తీసకుంది. దీనిపై స్పందించిన జోగి రమేష్…చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అగ్రిగోల్డ్ లో మా తప్పుంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరివేసుకుంటాం - మాజీ మంత్రి జోగి రమేష్
అగ్రిగోల్డ్ లో మా తప్పుంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరివేసుకుంటాం - మాజీ మంత్రి జోగి రమేష్

Jogi Ramesh : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు. తాజాగా జోగి రమేష్ కు మంగళిగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు...అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం- జోగి రమేష్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అనంతరం జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రాజీవ్ అరెస్ట్ సమయంలో జోగి రమేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలపై జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు వద్ద నిరసన తెలిపేందుకే వెళ్లనని, దాడి చేసేందుకు కాదన్నారు. కోపముంటే తనపై కక్ష తీర్చుకోవాలని, తన కొడుకు రాజీవ్ ఏం పాపం చేశాడన్నారు. మా అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్య చదివి.. అక్కడే ఉద్యోగం కూడా చేశాడని, కానీ ఈరోజు అన్యాయంగా తన కొడుకుని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామన్నారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని ఇలా కక్ష సాధింపు తగదన్నారు. చంద్రబాబుకు ఒక కొడుకు ఉన్నారని, ఇలా తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వంకర బుద్ధి మార్చుకోవాలన్నారు.

ఏసీబీ సోదాలు

ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున 15 మంది ఏసీబీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఏసీబీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కబ్జా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం రెండు వారాల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ సీఐడీ చర్యలు ప్రారంభించింది. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9 మందిపై కేసులు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి జోగి రమేష్ సర్వే నంబర్ల మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఏడాది క్రితమే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, జోగి రమేష్ కుమారుడు... జోగి రాజీవ్ ను అదుపులోకి తీసున్నారు.

జోగి రాజీవ్ పై అక్రమ కేసులు

మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఆయ‌న కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసు పెట్టించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తల‌పై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించినా, ఆయ‌న‌ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వ త‌ప్పుల‌ను ఎండ‌గ‌డుతూనే ఉంటామన్నారు.

సంబంధిత కథనం