Jogi Son Arrest: అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడి అరెస్ట్-former minister jogi rameshs son arrested in agrigold land case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jogi Son Arrest: అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడి అరెస్ట్

Jogi Son Arrest: అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడి అరెస్ట్

Sarath chandra.B HT Telugu
Aug 13, 2024 10:52 AM IST

Jogi Son Arrest: ఏపీ సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు జోగి తనయుడితో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదైంది.

అగ్రిగోల్డ్ భూమి రిజిస్ట్రేషన్ కేసులో జోగి రమేష్ తనయుడు అరెస్ట్
అగ్రిగోల్డ్ భూమి రిజిస్ట్రేషన్ కేసులో జోగి రమేష్ తనయుడు అరెస్ట్

Jogi Son Arrest: ఏపీ సీఐడీ అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి కబ్జా చేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూమి కబ్జా వ్యవహారాన్ని జూన్‌ 17న హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు తమ భూమిని కబ్జా చేశారంటూ గత జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ అగ్రిగోల్డ్ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆదేశించింది.

అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తే సీఐడీ నిర్లక్ష్యం బయట పడుతుందని గ్రహించిన పోలీసులు రెండువారాల క్రితం చర్యలు చేపట్టారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూమి కబ్జాకు గురైనట్టు ఫిర్యాదు నమోదు చేవారు. రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సీఐడీ అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం 9మంది ప్రమేయాన్ని గుర్తించి వారిపై గత వారం సీఐడీ కేసులు నమోదు చేసింది. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులపై ఏసీబీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

జోగి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐడీ కేసు దర్యాప్తు విషయంలో ఉన్నతాధికారులు చివరి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తొలుత కేసు నమోదు చేసినట్టు లీకులిచ్చినా అవన్నీ బెయిలబుల్ సెక్షన్లే నమోదు చేయడంతో జోగి కుటుంబం తేలిగ్గా తీసుకుంది. ఈ కేసులో జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషించడంతో అవినీతి నిరోధక సెక్షన్లను జత చేర్చారు. పక్కా ప్రణాళికతో నిందితుల అరెస్ట్‌ ప్రారంభించారు. విజయవాడ రూరల్ ఎమ్మార్వో జాహ్నవి రెడ్డితో పాటు మండల సర్వేయర్ రమేష్, విజయవాడ నున్న సబ్ రిజిస్ట్రార్ సాయంతో ఈ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తొమ్మిది మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీంతో కొందరు అధికారులు పరారైనట్టు తెలుస్తోంది.

చంద్రబాబు కక్ష సాధింపు…

అగ్రిగోల్డ్ భూమి వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తన కుమారుడు డెలాయిట్‌లో పనిచేస్తున్నాడని, ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారన్నారు

అగ్రిగోల్డ్ ఆస్తులు ఇప్పటికే అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని జోగి చెప్పారు. ప్రభుత్వం మంచి చేస్తే చెబుదామనుకున్నానని, అగ్రిగోల్డ్ భూములు అటాచ్‌మెంట్‌లో ఉంటే వాటిని ఎవరు కొంటారని, 2300గజాలు ఎవరు కొంటారని ప్రశ్నించారు. పత్రికలో వార్తలు వచ్చిన తర్వాత తన బాబాయ్, తన కుమారుడు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతరులకు విక్రయించినట్టు చెప్పారు.

తమ వద్ద భూములు కొనుగోలు చేసే వారు పత్రికల్లో ప్రకటన ఇచ్చి కొనుగోలు చేశారన్నారు. తన మీద కక్ష ఉంటే తన మీద తీర్చుకోవాలని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన తన కుమారుడి మీద కక్ష తీర్చుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయని రాజకీయ కక్ష సాధింపులు మంచిది కాదని జోగి చెప్పారు.

తాము అధికారంలో ఉన్నపుడు ఎవరి మీదకు దాడికి వెళ్లలేదన్నారు. జగన్ మీద అయ్యన్నపాత్రుడు నానా బూతులు తిడితే చంద్రబాబు ఇంటికి వచ్చి నిరసన తెలపడానికే తాను వెళ్లానని, చంద్రబాబుకు చెబితే మంచి చేస్తారని ఉండవల్లి వెళ్లినట్టు చెప్పారు. రాజకీయంగా తన మీద కక్ష తీర్చుకోవచ్చని తన కుమారుడి మీద కక్ష సాధింపు సరికాదన్నారు.

డైవర్షన్ పాలిటిక్స్‌ చేయొద్దని, సూపర్ సిక్స్‌ హామీలు అమలు చేయాలన్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని జోగి రమేశ్ చంద్రబాబును హెచ్చరించారు. బలహీన వర్గం కాబట్టే తన మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన కుమారుడు తప్పు చేస్తే శిక్షించాలన్నారు. ఏమి తెలియని తన కుమారుడిని ఇరికించడం సరికాదన్నారు.

అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1గా ఉన్న జోగి రాజీవ్‌ను ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఏ2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేవ్వరరావు ఉన్నారు. సీఐడీ నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై 420, 409, 467, 471, 120(బి), 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు. నిందితుల్లో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహ‍న రాందాసు, వెంకటసీతామహాలక్ష్మీ, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్‌, డిప్యూటీ తాసీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తాసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత కథనం