Police Negligence: విజయవాడ శివారు ప్రాంతాలకు యథేచ్చగా వలసలు, మొద్దు నిద్రలో ఏపీ పోలీసులు..-ap police surveillance in sleep arbitrary migration to bezawada suburbs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Police Negligence: విజయవాడ శివారు ప్రాంతాలకు యథేచ్చగా వలసలు, మొద్దు నిద్రలో ఏపీ పోలీసులు..

Police Negligence: విజయవాడ శివారు ప్రాంతాలకు యథేచ్చగా వలసలు, మొద్దు నిద్రలో ఏపీ పోలీసులు..

Sarath chandra.B HT Telugu
Aug 12, 2024 11:09 AM IST

Police Negligence: బెజవాడలో పోలీసుల నిఘా నిద్రపోతోంది. స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా వలసలు, అక్రమ నిర్మాణాలు సాగుతున్నా మొద్దు నిద్ర నటిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న దందా క్రమంగా అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తోంది.

భారత సరిహద్దుల్లో భారత్‌లో ప్రవేశించేందుకు  ఎదురు చూస్తోన్న బంగ్లాదేశ్ పౌరులు (ఫైల్ ఫోటో)
భారత సరిహద్దుల్లో భారత్‌లో ప్రవేశించేందుకు ఎదురు చూస్తోన్న బంగ్లాదేశ్ పౌరులు (ఫైల్ ఫోటో) (PTI)

Police Negligence: ఆంధ్రప్రదేశ్‌‌లో పోలీసులు మొద్దు నిద్ర వీడటం లేదు. నిఘా వ్యవస్థలు అటు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌‌తో పాటు ఇటు అంతర్గత సమస్యలను గుర్తించడంలో విఫలం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా విజయవాడ నగరంలోకి చాప కింద నీరులా భారీగా వలసలు పెరిగిపోయినా వాటిని గుర్తించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు.

ఉపాధి కోసం పొరుగుజిల్లాలు, రాష్ట్రాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జరగడం సాధారణమే అయినా విజయవాడలో మాత్రం అసహజమైన స్థాయిలో వలసలు కొన్నేళ్లుగా పెరిగాయి. వీటిని నియంత్రించడం, వలసదారులపై నిఘా పెట్టడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అక్రమ వలసదారులకు షెల్టర్‌జోన్లుగా విజయవాడ పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు ఆటోనగర్, సనత్‌నగర్‌, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడ పాతబస్తీలోిన వించిపేట, రాజరాజేశ్వరిపేట, పంజాసెంటర్‌, మహంతిపురం, ఆటోనగర్‌, కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వలసదారులు మకాం వేశారు. యూపీ, బీహార్, బెంగాల్, ఝార్ఖండ్ రాాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వలస దారులు విజయవాడలో స్థిరపడ్డారు.

స్థానికేతరులపై నిఘా ఉండని ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వలసలు పెరిగాయి. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో గత పదేళ్లలో మొత్తం ఓటర్లలో రెండు శాతం స్థానికేతరులు జత చేరారు. ఓ పద్ధతి ప్రకారం వలసల్ని స్థానిక నాయకులు ప్రోత్సహించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

స్థానికంగా గుర్తింపు కార్డులు…

తోపుడు బళ్లపై వ్యాపారాలు, కాన్పూర్ దుప్పట్లు, చెప్పులు, పానీపూరీ బళ్లు, పింగణి వస్తువులు, నిర్మాణ కూలీలు, బ్యాగుల తయారీదారులు, పిఓపి సీలింగ్ వర్కర్లుగా గత కొన్నేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి భారీగా వలసలు పెరిగాయి. స్థానికుల కంటే ఎక్కువ అద్దె చెల్లించడానికి సిద్ధపడటంతో వారికి ఎలాంటి ధృవీకరణలు లేకుండా ఇళ్లు అద్దెకు ఇవ్వడం గత పదేళ్లలో బాగా పెరిగింది. ఉపాధి కోసం వచ్చిన వారిలో చాలామంది క్రమంగా ఇక్కడే ఇళ్లను కొనుగోలు చేసి స్థిరపడటం పెరిగిపోయింది. విజయవాడ పాతబస్తీ ప్రాంతంలో ఈ తరహా విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇక ఇళ్లను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న వారికి అక్రమ నిర్మాణాలకు స్థానిక నాయకులు సహకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, రైల్వే స్థలాల్లో అక్రమ నిర్మాణాలను ద్వితీయ శ్రేణి నాయకత్వం సహకరిస్తోంది. గత ఐదేళ్లలో ఇలా వేలాదిమందితో అక్రమ నిర్మణాలను ఓ పార్టీ నాయకులు ప్రోత్సహించారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇలా వలసలు బాగా పెరిగాయి. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ వంటి నగరాలపై ఈ వలసలు పెరిగాయి. స్థానికంగా ఉన్న ప్రశాంత వాతావరణం వారికి అనువుగా చేసుకుంటున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిర వాతావరణం నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో స్థిరపడేందుకు అక్రమ వలసలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

చిరు వ్యాపారులుగా ఎంట్రీ…

బ్యాగుల తయారీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ పనులు, పానీపూరీ బళ్లు, ఐస్‌ క్రీమ్‌ల తయారీ, చిన్నా చితక వ్యాపారాలతో నగరంలో తిష్ట వేస్తున్నారు. ఇలా వచ్చే వారిలో బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు నేతలు ఈ తరహా వలసల్ని ప్రోత్సహించారు. తమ వర్గం ఓట్లను పెంచుకోడానికి ఇలాంటి అక్రమాలకు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికయ్యేందుకు కొందరు నేతలు ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

స్థానికేతరులపై నిఘా పెట్టని పోలీసులు...

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై కనీస నిఘా లేకుండానే ఇళ్లను అద్దెకివ్వడంతోనే ఈ సమస్య మొదలవుతోంది. స్థానికంగా ఉండే గల్లీ స్థాయి నాయకులకు ఎంతో కొంత ముట్ట చెబితే బెజవాడలో అద్దె ఇళ్లు లభించడం పెద్ద సమస్య కాదని, ఇక్కడ చేరిన వారు అయా ప్రాంతాలకు సమాచారం ఇస్తున్నారు.

ఇలా వచ్చే వారికి కనీస వివరాలు సేకరించకుండానే యజమానులు ఇళ్లను అద్దెకిస్తున్నారు. ఇలా వచ్చిన వారికి అనతి కాలంలోనే స్థానికంగా ఓటరు కార్డులు, వాటి ఆధారంగా గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల్ని పొందుతున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి అక్రమాలకు వాలంటీర్లు పూర్తి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. వలస వచ్చిన వారిని ఓటర్ల జాబితాల్లో చేర్పించడంలో వారు కీలక పాత్ర పోషించారు.

అక్రమ వలసదారులపై కార్డన్‌ సెర్చ్‌లు, వారిని గుర్తించే యంత్రాంగం లేనేలేదు. స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరనే దానిపై ఎలాంటి గణాంకాలు ప్రభుత్వ యంత్రాంగం వద్ద లేవు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారితో పాటు బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి వచ్చే వారు కూడా వలసదారుల్లో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికేతరుల ప్రాబల్యంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలే గత ఎన్నికల ఫలితాలకు కారణం అయ్యాయనే వాదనలు కూడా ఉన్నాయి. పోలీసులు మొద్దు నిద్ర వీడి స్థానికేతరులపై పక్కా సమాచారాన్ని క్రోడీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.