Devineni Avinash: శంషాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నం, అడ్డుకున్న తెలంగాణ పోలీసులు-telangana police stopped devines attempt to go to dubai from shamshabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Devineni Avinash: శంషాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నం, అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

Devineni Avinash: శంషాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నం, అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

Sarath chandra.B HT Telugu
Aug 16, 2024 11:38 AM IST

Devineni Avinash: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్‌పై ఏపీ పోలీస్ లుకౌట్‌‌ ఉండటంతో అడ్డుకున్నారు.

దేవినేని అవినాష్
దేవినేని అవినాష్ (facebook)

Devineni Avinash: వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రాత్రి శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాష్‌ ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు.

దేవినేని అవినాష్‌ను గురువారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నట్టు ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ధృవీకరించారు. మంగళగిరి గ్రామీణ పోలీసుల లుకౌట్‌ నోటీసులతో దేవినేని అవినాష్‌ను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌ ఇమిగ్రేషన్ సమాచారాన్ని మంగళగిరి పోలీసులకు ఎయిర్‌ పోర్ట్ పోలీసులు తెలియచేయడంతో ప్రయాణానికి అనుమతించొద్దని ఏపీ పోలీసులు సూచించినట్టు తెలుస్తోంది. 

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్‌ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు.

తాజాగా ఆయన దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దుబాయ్‌ పారిపోయే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నియోజక వర్గంలో అవినాష్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ హయంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్‌ ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఉన్నాయి.

తాజాగా లుకౌట్‌ నోటీసులతో దేవినేని అవినాష్‌ విదేశీ పర్యటనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో పలువురు నేతలు ముందస్తు బెయిల్‌ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు విదేశీ ప్రయాణానికి అనుమతించకపోవడంతో దేవినేని అవినాష్ విమానాశ్రయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.